రాష్ట్రంలో ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ
పులివెందుల: మెడికల్ కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ రాష్ట్రంలో ఉద్యమంలా కొనసాగిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందులలోని తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ఎంతో ముందు చూపుతో పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలలను నిర్మిస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఆ కళాశాలలను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యాడని ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడానికే ఎన్‌ఎంసీ మంజూరు చేసిన మెడికల్ సీట్లను సైతం చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు పంపిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కళాశాలల యజమాన్యాలు వారికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడంలేదన్నారు. కూట మి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18నెలల కాలంలో రైతులు పండించిన ఏ పంటకు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. రాష్ట్రంపై శ్రద్ధ చూపాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉన్న అవినీతి కేసులను కొట్టి వేయించుకోవడంలో ఎక్కడలేని శ్రద్ధ చూపుతున్నా డని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే న్యాయపరంగా కేసులు ఎదుర్కొవాలి కానీ దొడ్డి దారిలో ఎందుకు కొట్టి వేయించుకుంటున్నాడని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.


