ఫీజు దోపిడీ!
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో పదో తరగతి ఫీజు వసూళ్లలో కొన్ని ప్రైవే టు, కార్పొరేట్ స్కూళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. నిబంధనల మేరకు పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ. 125లుగా నిర్ణయించారు. ఇది ఎక్కడ అమలు జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ణయించిన పరీక్ష ఫీజు కంటే అదనంగా రూ.500 నుంచి రూ.1000 వరకు విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లి దండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
● వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ పాఠ శాలల్లో మొదలైంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లోనూ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలని విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాలు అదనంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలు కావడం లేదు. జిల్లాలోని బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైదుకూరు, పొద్దుటూరు నియోజకవర్గాల్లో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా అదనంగా పబ్లిక్ పరీక్ష ఫీజు పేరుతో దోచేస్తున్నారు.
అదనపు వసూళ్లపై చర్యలేవీ?
తాము నిర్ణీత పరీక్ష ఫీజులు చెల్లిస్తామని చెబుతున్నా అదనపు ఖర్చులు ఉంటాయని ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలు చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అడిగిన మేరకు ఇవ్వని తల్ల్లిదండ్రుల పిల్లలకు ఏదో ఓ సాకు పెట్టి తోటి విద్యార్థుల ముందు అవమానాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కొంత మంది పేరెంట్స్, విద్యార్థి సంఘాలు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు చూస్తాం...చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్దేశించిన ఫీజుకంటే అదనంగా వసూళ్లు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు
విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలంటున్న విద్యార్థి సంఘాలు


