గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
మైదుకూరు : మైదుకూరు పట్టణ శివార్లలో మైదుకూరు–వనిపెంట రహదారిపై గురువారం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని మునగల వెంకటరమణ (63) అనే వృద్ధుడు మృతి చెందాడు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకటరమణ పూసల దండలు, గిల్ట్ ఆభరణాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం సైకిల్‌పై కాలనీ నుంచి వెళుతుండగా వనిపెంట రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య రమణమ్మ, కుమారుడు జమాల్ ఉన్నారు. అర్బన్ సీఐ రమణారెడ్డి ఆదేశంతో హెడ్ కానిస్టేబుల్ బాదుషా సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


