కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు
బద్వేలు అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు రాబోవు రోజుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక బయనపల్లె సమీపంలోని బొజ్జిరెడ్డి ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపాలిటీ, బద్వేలు రూరల్, గోపవరం, అట్లూరు మండలాల గ్రామ కమిటీల ఏర్పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత పటిష్టంగా సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యులకు క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ఐడీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్డుల ద్వారా భవిష్యత్తులో సభ్యులకు అన్నివిధాలా ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీల నియామకంలో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్రభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతంలో గ్రామ కమిటీలు కీలకమనే విషయాన్ని ప్రతి నాయకుడు గుర్తించి కమిటీ సభ్యులను ఎంపిక చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ పేర్కొన్నారు. నిబద్ధత, విశ్వాసంతో పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 2029 ఎన్నికల వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా లెక్క చేయకుండా ప్రతి కార్యకర్త చావో రేవో అనే విధంగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బద్వేలు నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.
యువతకు పెద్దపీట వేయాలి
గ్రామ కమిటీల నిర్మాణంలో యువతకు పెద్దపీట వేసేలా నాయకులు కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి కోరారు. ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై యువతలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో చురుకుగా పనిచేసే యువ కార్యకర్తలను ఎంపిక చేయడం ద్వారా పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, మున్సిపాలిటీ, ఆయా మండలాల అధ్యక్షులు సుందర్‌రామిరెడ్డి, మల్లేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రవిచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ, పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాఽథ్‌రెడ్డి


