నివాసం లేని ఆవాసం
కడప సిటీ : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సొంతింటి కల సాకారం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు సంబంధించి 92 వేల పైచిలుకు నిరుపేదలకు గృహాలు నిర్మించాలని సంకల్పించారు. జిల్లాలో 400 లే–అవుట్లు ఏర్పాటు చేసి వీటిని నిర్మించాలన్నది ప్రధాన లక్ష్యం. అప్పటికే దాదాపు 50 శాతం పూర్తి చేశారు. అంతలోపే ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.జగనన్న కాలనీ అనే పేరును తొలగించి ఎన్టీఆర్ కాలనీలని, పీఎంఏవై 1.0 అని పేరు పెట్టుకుని తామే కట్టించినట్లు కూటమి ప్రభుత్వం బిల్టప్ ఇస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోంది. దీంతో నివాసం లేని ఆవాసాలుగా పక్కా గృహాలు తయారయ్యాయి. మౌలిక వసతులు లేకపోవడంతో చేరేందుకు లబ్ధిదారులు సాహసించడం లేదు.
జిల్లా వ్యాప్తంగా
వైఎస్సార్ కడపజిల్లాలో ఏడు నియోజకవర్గాలతోపాటు రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట, సిద్దవటం తదితర ప్రాంతాల్లో దాదాపు జగనన్న హయాంలో 92 వేల పైచిలుకు పక్కా ఇళ్లు మంజూరు చేశారు. అయితే కొన్ని పనులు మొదలు పెట్టని కారణంగా అధికారులు వాటిని తొలగించారు. ప్రస్తుతం 89,529 పక్కా గృహాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇందులో 42084 గృహాలు పూర్తి కాగా, 50 శాతం పూర్తయినట్లైంది. మిగతా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి.
10 శాతం మంది చేరిక
జిల్లా వ్యాప్తంగా పూర్తయిన పక్కా గృహాలు 42,084 ఉండగా, ఇందులో నివాసం ఉండేందుకు లబ్ధిదారులు జంకుతున్నారు. మౌలిక వసతులు లేనందువల్ల ఇబ్బందులు పడతామని ఆయా కాలనీల్లో ఉండేందుకు సాహసించడం లేదు. కేవలం 10 శాతం మంది మాత్రమే గృహాల్లో చేరారు. ఇంకా 90 శాతం మంది గృహాల్లో చేరకుండా బయట బాడుగ ఇళ్లల్లో నివాసముంటున్నారు. ప్రభుత్వం నిర్మించిన పక్కా గృహాల కాలనీల్లో మౌలిక వసతుల కొరత పట్టిపీడిస్తోంది. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్, వీధిలైట్లు, తాగునీరు లేకపోవడంతో లబ్ధిదారులు చేరేందుకు సాహసించడం లేదు. ఇళ్లు పూర్తయినప్పటికీ అక్కడ మౌలిక వసతులు కల్పించకపోవడంతో చేరేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇల్లు తయారైందని సంబరపడిన వారు మౌలిక వసతుల కొరతతో నిరాశ నిస్పృహాల్లో ఉన్నారు.
విష పురుగులతో సావాసం
ఆయా ప్రభుత్వ పక్కా గృహాల్లో వీధి లైట్లు లేకపోవడంతో విష పురుగులతో సావాసం చేయాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ విష పురుగు చీకట్లో కాటేస్తుందోనన్న భయంతో జంకుతున్నారు. ఈ కారణంగా కూడా చాలామంది అక్కడ నివాసం ఉండేందుకు ఇష్టపడటం లేదు.
చోరీల భయం
కాలనీల్లో ఒక్కో లే–అవుట్‌లో వందల నుంచి వేల ఇళ్ల వరకు మంజూరు అయ్యాయి. కానీ 50 శాతం ఇళ్లు పూర్తయినప్పటికీ 10 శాతం మందే నివాసం ఉండడం వల్ల చోరీలు చేసేందుకు దొంగలకు అవకాశంగా మారుతోంది. దీంతో ఇల్లు వదలి వెళితే చోరీలు జరుగుతాయని ఆవేదనలో ఎక్కడికి వెళ్లకుండా ఉండిపోతున్నారు. ప్రభుత్వ కాలనీల్లో ఇంత జరుగుతున్నా మౌలిక వసతుల కొరత పట్టిపీడిస్తున్నా ఏమాత్రం చలించడం లేదు. నిర్లక్ష్యం వైఖరి అవలంభిస్తోంది. సంబంఽధిత అధికారులు మౌలిక వసతుల కల్పనకు నిధులు అవసరమని నివేదికలు పంపినప్పటికీ ఉలుకు పలుకు లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహారిస్తోంది. దీంతో లబ్ధిదారులు మౌలిక వసతులు లేకపోవడంతో నివాసం ఉండేందుకు ముందుకు రావడం లేదు.
పట్టిపీడిస్తున్న మౌలిక వసతుల కొరత
ఇప్పటివరకు పది శాతం మంది కూడా కాలనీల్లో చేరని వైనం
వెంటాడుతున్న చోరీల భయం
చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి
మౌలిక వసతుల కోసం రూ. 10 కోట్లు అవసరమని నివేదిక
నివాసం లేని ఆవాసం


