సౌదీ ఘటన విషాదకరం
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల : సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 42 మంది మరణించడం విషాదకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశానికి చెందిన యాత్రికులతో కూడిన బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన మన తెలుగు వారు ఉండటం బాధ కలిగించే అంశం అని అన్నారు. మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియజేశారు.
సౌదీ అరేబియాలో ప్రమాదంపై అంజద్‌బాషా దిగ్భ్రాంతి
కడప కార్పొరేషన్ : సౌదీ అరేబియాలో బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం అని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజద్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. మక్కా నుంచి మదీనా వెళ్తున్న మార్గంలో జరిగిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఉమ్రా యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు. మృతులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపి, వారి కుటుంబీకులకు సానుభూతి వ్యక్తం చేశారు.
సౌదీ బస్సు ప్రమాదం బాధాకరం
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాద ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ తెలిపారు. ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు మదీనా వద్ద ప్రమాదానికి గురైందన్నారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఆటో బోల్తా : నలుగురికి గాయాలు
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్‌ను తిలకించేందుకు నలుగురు మహిళలు ఆటోలో వెళ్లారు. ఆటో బోల్తా పడడంతో వీరికి గాయాలయ్యాయి. వివరాలు.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల గ్రామానికి చెందిన మహిళలు బ్రహ్మంగారిని దర్శించుకున్న తరువాత బ్రహ్మంసాగర్‌ను తిలకించేందుకు ఆటోలో వెళ్లారు. ఆటో పైకి ఎక్కేలోపు బోల్తా పడడంతో అందులో ఉన్న వారిలో నారాయణమ్మ, సుధామణి, రాజమ్మ, ఓబులమ్మకు గాయాలయ్యాయి. వీరిని 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఒకరికి కాలు విరిగినట్లు తెలిసింది.
పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్
పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం గుణకణపల్లె గ్రామంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తర్వాత బలవంతం చేసిన కేసులో నిందితుడు షేక్ ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ రమణ తెలిపారు. సోమవారం పట్టణంలోని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భాకరాపురంలోని మిట్ట గోపాల్ కాంప్లెక్స్‌లో నివాసముంటున్న షేక్ బాబ్‌జాన్ కుమారుడు షేక్ ఇమ్రాన్‌ను పులివెందుల – పార్నపల్లె మెయిన్ రోడ్డు, తాతిరెడ్డిపల్లె క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో లింగాల ఎస్‌ఐ అనిల్‌కుమార్, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.


