వివాహిత ఆత్మహత్య
సిద్దవటం : మండలంలోని టక్కోలు గ్రామానికి చెందిన దుంపల వాసంతి (25) అనే వివాహిత సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వీరపునాయునిపల్లె మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వాసంతికి టక్కోలు గ్రామానికి చెందిన శివానందరెడ్డితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నాలుగు సంవత్సరాల కుమారుడు సార్వీక్‌రెడ్డి, 4 నెలల పాప ఉంది. భర్త శివానందరెడ్డి జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావడం లేదు. సమాచారం తెలుసుకున్న ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌రెడ్డి, సిద్దవటం ఏఎస్‌ఐలు సుబ్బరామచంద్ర, బాబయ్యలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఒంటిమిట్ట సీఐ తెలిపారు.
వేర్వేరు ప్రాంతాల్లో చోరీ
వేంపల్లె : వేంపల్లెలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో ఉన్న కందుల కాంప్లెక్స్ లో తేజ శారీ సెంటర్ దుకాణానికి చెందిన బీగాలను గుర్తు తెలియని దుండగులు పగులకొట్టి దుకాణంలో ఉన్న పట్టు చీరలతో పాటు రూ.6వేల నగదును చోరీ చేశారు. అలాగే నాలుగు రోడ్ల కూడలి సమీపంలో ఉన్న జీవాల మార్కెట్‌లో ఉన్న లక్కీ హెయిర్ స్టైల్ కటింగ్ షాపులో ఉన్న 32 ఇంచుల టీవీని ఎత్తుకెళ్లడంతోపాటు క్యాష్ పెట్టెను పగులగొట్టే ప్రయత్నం చేశారు. ఉదయం షాపులకు వచ్చి తలుపులకు ఉన్న బీగాలను చూసి దుకాణాల యాజమానులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ సంఘటన స్థలానికి వచ్చి చోరీ జరిగిన తేజ శారీ సెంటర్ దుకాణాన్ని పరిశీలించారు. అలాగే దుకాణాపు యాజమాని సుబ్బరాయుడుతో కూడా విషయం అడిగి తెలుసుకున్నారు. చోరీలు జరగకుండా ఉండేందుకు ప్రతి దుకాణాదారుడు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని డీఎస్పీ కోరారు. దుండుగులను పట్టుకొనేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేయాలని సీఐ నరసింహులును డీఎస్పీ ఆదేశించారు.
వివాహిత ఆత్మహత్య


