దేవస్థాన అన్నసత్రం దొంగతనం కేసులో జైలుశిక్ష
పోరుమామిళ్ల : మద్దిమాను గురప్పస్వామి దేవస్థాన అన్నదాన సత్రంలో జరిగిన దొంగతనంపై బద్వేలు కోర్టులో న్యాయమూర్తి ముద్దాయికి 5 నెలల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించారని ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణం గుర్రాలమెట్ట కాలనీకి చెందిన ఆవుల రామకృష్ణ(33)ను అరెస్టు చేసి బద్వేలు కోర్టులో ప్రవేశపెట్టగా, కేసు విచారించిన న్యాయమూర్తి సోమవారం శిక్ష విధించారన్నారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల
మెరిట్ జాబితా విడుదల
కడప అర్బన్ : సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన జరిగే నియామకాలకు సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ లిస్టును కడప జిల్లా ప్రభుత్వ వెబ్‌సైట్ హెచ్‌టీటీపీఎస్ డాట్స్// కేఏడీఏపీఏ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ లో సోమవారం ఉంచారు. అభ్యర్థులు ఈ జాబితాను పరిశీలించి వారి అభ్యంతరాలు గ్రీవెన్స్‌లను స్వయంగా ఆఫీసు సమయంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏడీఎంఈ లేదీ కడప ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వద్ద నేరుగా వచ్చి తెలియజేయవచ్చని కడప ప్రభుత్వ వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వారు తెలిపారు.
కుష్టు వ్యాధి ప్రాణాంతకం కాదు
ప్రొద్దుటూరు క్రైం : కుష్టు వ్యాధి ప్రాణాంతకమైంది కాదని సకాలంలో వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్యుల సూచన మేరకు మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయం అవుతుందని డీపీఎంఓ శివశంకరయ్య తెలిపారు. పట్టణంలోని రామ్‌నగర్‌లో ఎల్‌సీడీసీ కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇంటింటి సర్వే చేశారు. ఈ సర్వేను డీపీఎంఓ శివశంకరయ్య పర్యవేక్షించారు. శరీరంపై స్పర్శలేని రాగి రంగు మచ్చలు కలిగి ఉండి, చేతులు, పాదాలు, నరాలు, తిమ్మిర్లు తదితర లక్షణాలు కనిపిస్తే అనుమానితులుగా భావించి పరిశీలన కోసం రెఫర్ చేస్తామని ఆయన తెలిపారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారు భయపడాల్సిన పనిలేదని, ఎండీటీ మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందని చెప్పారు. అనంతరం వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈహెచ్‌ఓ శోభారాణి, సీఓ ఎంవీ సుబ్బారెడ్డి, హెల్త్ సెక్రటరీ ఉదయలక్ష్మి, ఆశ, వలంటీర్లు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత నిమ్మ మొక్కలు పీకేసిన దుండగులు
చక్రాయపేట : మండలంలోని చిలేకాంపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దేశాయి ఆదిరెడ్డి పొలంలొ ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 20కి పైగా సన్న నిమ్మ మొక్కలను పీకేశారు. బాధితుడు ఆదిరెడ్డి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం ఎకరం పొలంలో నిమ్మ మొక్కలు నాటానని వాటిలో 20 మొక్కలు పీకేశారని చెప్పారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు తెలిపారు.
దేవస్థాన అన్నసత్రం దొంగతనం కేసులో జైలుశిక్ష


