నల్లపురెడ్డిపల్లెలో కేబుల్ వైర్లు చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గంలో పొలాల వద్ద కేబుల్ వైర్ల చోరీలు ఆగడం లేదు. మొన్న లింగాల మండలం మురారింతల, అంబకపల్లె గ్రామాల్లో రైతుల పొలాల్లో కేబుల్ వైర్లను గుర్తుతెలియ వ్యక్తులు అపహరించి తీసుకెళ్లారు. కేబుల్ వైర్ల చోరీలు జరిగి వారం రోజులు కాకముందే పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో 14 మంది రైతులకు సంబంధించిన 14 మోటార్ల వద్ద ఉన్న కేబుల్ వైర్లను అపహరించుకపోయారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కేబుల్ వైర్ల చోరీలు జరుగుతున్నా సంబంధిత పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప.. ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అసలే పంటలకు గిట్టుబాటు ధరల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో మోటార్ల వద్ద ఉన్న కేబుల్ వైర్లు దొంగిలించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, గంగరాజు, ఆంజనేయులు, రవి, శివశంకర్, శ్రీనివాసులు, శేఖర్‌రెడ్డిలతోపాటు మరో 8 మంది రైతుల తోటల వద్ద ఉన్న రూ.2 లక్షల విలువ చేసే కేబుల్ వైర్లను అపహరించుకుపోయారని రైతులు వాపోతున్నారు. కేబుల్ వైర్లతోపాటు అక్కడ ఉన్న స్టార్టర్లు కూడా కాలిపోయాయని రైతులు చెబుతున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు..
పులివెందుల, లింగాల మండలాల్లో వరుసగా రైతులకు సంబంధించిన కేబుల్ వైర్లు చోరీలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా కేబుల్ వైర్లు దొంగతనాలు జరుగుతున్నా.. చోరీలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేబుల్ వైర్ల చోరీల విషయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంతోనే దొంగలు కేబుల్ వైర్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత పోలీస్ అధికారులు స్పందించి కేబుల్ వైర్ల చోరీలు జరగకుండా గట్టి నిఘా ఉంచాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.
నల్లపురెడ్డిపల్లెలో కేబుల్ వైర్లు చోరీ


