పోలీసుల అత్యుత్సాహం
● కారుకు ఆటో తగిలిందంటూ
హత్యాయత్నం కేసు
● కేసు వద్దంటున్నా పోలీసులు బెదిరించి బాధితునితో ఫిర్యాదు చేయించిన వైనం
● ఇదెక్కడి న్యాయం అంటున్న ప్రజలు
జమ్మలమడుగు : అధికార పార్టీ వత్తిళ్లతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బాధితులు తమకు కేసు వద్దు అంటున్నా అంతా మీ ఇష్టమేనా.. మేము ఎందుకు ఉండేది.. మర్యాదగా ఫిర్యాదు ఇవ్వు అంటూ బెదిరించి ఇద్దరిపైన 307 (క్రైం నంబర్ 213/225) సెక్షన్ కింద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం కొండాపురం మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త వి.నాగేంద్ర తాడిపత్రి సమీపంలో సపోట తోట వద్ద సపోట సంచులను ఆటోలో వేసుకుని తీసుకుని వస్తుండగా తాడిపత్రికి చెందిన కార్తీక్‌రెడ్డి కారుకు ఆటో తగిలింది. దీంతో నాగేంద్ర కార్తీక్‌రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి నాగేంద్ర ఆటోలో తాళ్లప్రొద్దుటూరుకు పయనమయ్యాడు. దీంతో కార్తీక్ రెడ్డి తిరిగి కారును తీసుకుని నాగేంద్రను తాడిపత్రి–జమ్మలమడుగు సరిహద్దు గ్రామమైన సుగుమంచిపల్లె వద్ద అడ్డగించి ఆటోను పగుల గొట్టాడు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త బి. ప్రతాపరెడ్డికి నాగేంద్ర ఫోన్ చేయగా అతను అక్కడికి వచ్చాడు. వీరిద్దరు ఆటో అద్దాలు ఎందుకు పగులకొట్టారని ప్రశ్నించారు. దీంతో మళ్లీ వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు నాగేంద్రను స్టేషన్‌కు పిలిపించారు. అదే విధంగా కార్తీక్‌రెడ్డిని సైతం నాగేంద్రపై కేసు పెట్టమని వత్తిడి చేశారు. తనకు ఎలాంటి కేసు అక్కరలేదని చెప్పినా సీఐ, ఎస్‌ఐలు కేసు పెట్టకపోతే ఇబ్బందులు పడతావంటూ బెదిరింపులకు దిగారు. ఎట్టకేలకు కార్తీక్‌రెడ్డి చేత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నాగేంద్ర, ప్రతాప్‌రెడ్డిపై కేసు నమోదు చేయించారు. దీంతో పోలీసులపై ప్రైవేట్ కేసు వేసేందుకు నిందితులు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. పోలీసులు అధికార పార్టీ నాయకుల వత్తిళ్లకు లొంగి చిన్న చిన్న సంఘటనల విషయంలోనూ బెదిరింపులకు పాల్పడి హత్యాయత్నం కేసులు నమోదు చేయించడం సరైంది కాదని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


