హడావిడిగా ఆర్కిటెక్చర్ వర్సిటీ తరలింపు
● పెండింగ్‌లో 15 నెలల
అద్దె బకాయిలు
● ఒప్పందాన్ని తుంగలో తొక్కిన వర్సిటీ అధికారులు
● కనీస వసతులు లేకున్నా
గురుకులం భవనాల్లోకి
● వీసీ నిర్ణయం వెనుక
రాజకీయ ఒత్తిళ్లు !
సాక్షి ప్రతినిధి కడప : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ అధికారులు నిబంధనను.. ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. జిల్లా కేంద్రమైన కడప సమీపంలో ఉన్న సదరు యూనివర్శిటీని హడావిడిగా యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 21వ సెంచరీ గురుకులం భవనాల్లోకి తరలిస్తూ వీసీ ఆచార్య బి.జయరామిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లీజు నిబంధనలు పాటించకుండా వీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి భవన సముదాయంలో నడుస్తోంది. ఒకవేళ యూనివర్శిటీ తమ సొంత భవనాల్లోకి వెళ్లదలుచుకుంటే లీజు ఒప్పందం ప్రకారం మూడు నెలల ముందే శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ యాజమాన్యానికి నోటీసు ద్వారా తెలియజేయాలి. అలాగే భవనాల అద్దెలు, ఇతర బకాయిలను పూర్తిగా చెల్లించాలి. ఈ మేరకు ఒప్పందంలో రాసి ఉంది. అగ్రిమెంటు ప్రకారం మూడు నెలల ముందుగానే ఆ విషయాన్ని తమకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ వైస్ చాన్సలర్ ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై భవన యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే 15 నెలలకు సంబంధించి విద్యుత్ బిల్లులతో కలిపి దాదాపు రూ. 3.50 కోట్ల అద్దె బకాయి లు, ఇతర చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లు సదరు యాజమాన్యం చెబుతోంది. పైగా మార్చిలో ఖాళీ చేయాల్సిందిగా జనవరిలో లేఖ రాస్తే.. స్పందించిన అధికారులు విద్యా సంవత్సరం కొనసాగిస్తామని రాతపూర్వక జవాబు ఇచ్చారని చెబుతోంది. కాగా ఈనెల 14వ తేది వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య బి.జయరామిరెడ్డి అనతికాలంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అధికార పార్టీకి చెందిన బలమైన నాయకుల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది.
విద్యార్థుల అగచాట్లు
యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 21వ సెంచురీ గురుకులం భవనాల్లో కనీస వసతులు సైతం లేవని తెలుస్తోంది. హాస్టల్ గదులు, తాగునీరు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు లేకపోతే తమ చదువులు ఎలా ముందుకు వెళతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని వసతులు సమకూర్చిన తర్వాత కొత్త భవనాల్లోకి యూనివర్శిటీని తరలించి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదని వారు అంటున్నట్లు సమాచారం. ఇప్పటికై నా హడావడి నిర్ణయాలను ఉపసంహరించుకుని, సొంత భవనాలు సమకూరిన తర్వాత వర్శిటీని తరలిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


