
ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కడప అగ్రికల్చర్ : ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం(ఏఐకేఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. వి. సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్ డిమాండ్ చేశారు. కడపలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 15 వేల ఎకరాలలో ఉల్లి పంటను సాగు చేశారన్నారు. ఉల్లి పంట కోతకు వచ్చిన దశలో ఉల్లిగడ్డల ధరలు అమాంతం పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ప్రజా ప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లాలో ఉల్లి సాగుచేసిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కమలాపురం నియోజకవర్గ కార్యదర్శి జి. నాగేశ్వరరావు పాల్గొన్నారు.