
అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు
వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అరుణ అనే పేరుతో ఆసుపత్రి పెట్టి వైద్యం చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. హోమియోపతి డాక్టర్ (బీహెచ్‌ఎంఎస్) విజయ్ కుమార్ అల్లోపతి వైద్యం చేయడంతోపాటు స్కానింగ్, కాన్పులు చేస్తున్నట్లు చెప్పారు. గతనెల 11వ తేదీన పులివెందుల డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఖాజా మొయినుద్దీన్ ఈ ఆసుపత్రిని తనిఖీ చేయగా కాన్పులతోపాటు అల్లోపతి వైద్యం చేస్తుండటంతో ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఓపీ రూంలను సీజ్ చేశారు. మళ్లీ రెండు రోజుల కితం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తన సిబ్బందితో ఆసుపత్రిని తనిఖీ చేయగా ఇద్దరు గర్భిణులు కాన్పులు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా విజయ్ కుమార్ తో పాటు ఆయన సతీమణి ఇరువురు ఆసుపత్రిని గత 8 సంవత్సరాలుగా వేంపల్లెలో నడుపుతున్నట్లు చెప్పారు. అలాగే రేడియాలజిస్ట్ లేకుండా స్కానింగ్ సెంటర్ నడుపుతున్నారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్‌లో విజయ్ కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్‌కు పంపినట్లు సీఐ చెప్పారు.