
వైవీయూ అభివృద్ధికి కృషి
నూతన వీసీ బెల్లంకొండ రాజశేఖర్
కడప ఎడ్యుకేషన్: వైవీయూ అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని.. న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడు సొంతం చేసుకోవాలని.. ఆ దిశగా మనమంతా శ్రమిద్దామని యోగి వేమన విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. విశ్వవిద్యాలయ వీసీగా సోమవారం ఆయన వైవీయూ పరిపాలన భవనంలోని తన ఛాంబరులో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, ప్రధానాచార్యులు టి.శ్రీనివాస్, ఆచార్యులు, సహ, సహాయ ఆచార్యులు, అకడమిక్ కన్సల్టెంట్లు, బోధనేతర సిబ్బంది, స్కాలర్లు, విద్యార్థులు నూతన ఉపకులవతికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన, బోధనేతర సిబ్బంది విశ్వవిద్యాలయాన్ని మాతృమూర్తిలా భావించి విశ్వవిద్యాలయం నాది అనే భావనతో పనిచేయాలని కోరారు. పీజీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరగాలని ఆదిశగా ప్రయత్నాలు జరగాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం యూజీసీ నెట్ పేపర్ –1 కోసం శిక్షణ ఇస్తామన్నారు. అలానే పరిశోధక విద్యార్థులు పీహెచ్‌డీలు నిర్ణీత కాలంలో పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధానాచార్యులు టి.శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు ఆచార్య చంద్రమతి శంకర్. ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, డా. మాదక్క, ముఖీనా బేగం, అధ్యాపకులు. బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బందితో సమావేశం..
వైవీయూను ప్రగతి పథంలో నడిపించడం కోసం సమిష్టిగా కృషి చేద్దామని వీసీ బెల్లకొండ రాజశేఖర్ పిలుపునిచ్చారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం బోధనా, బోధనేతర సిబ్బందితోక్యాంపస్‌లోని అన్నమాచార్య సెనెట్ హాల్లో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలన్నారు.

వైవీయూ అభివృద్ధికి కృషి