
జీఎస్టీ తగ్గింపుతో రైతులకు చేయూత
కడప అగ్రికల్చర్ : రైతులకు ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో వ్యవసాయ పరికరాలపై వస్తు, సేవల పన్ను తగ్గించినట్లు డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. వ్యవసాయ పరికరాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం కడప నగరంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. ఈ తగ్గింపు ప్రధానంగా వ్యవసాయ ట్రాక్టర్లు, విడిభాగాలు, డ్రిపు ఇరిగేషన్, స్పింక్లర్లు, వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ డ్రోన్లు, ఆక్వాకల్చర్ పరికరాలు, పాలక్యాన్లు, 12 రకాల బయో ఫెస్టిసైడ్ వంటి వివిధ రకాల వస్తువులకు వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతోపాటు కడప, సికెదిన్నె, ఖాజీపేట, చెన్నూరు, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట ప్రాంతాల నుంచి రైతులు పాల్గొన్నారు.