
గాంధీ ఆశయాలకు తూట్లు పొడిచేలా కూటమి పాలన
కడప కార్పొరేషన్ : మహాత్మా గాంధీ ఆశయాలకు తూట్లు పొడిచేలా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ అహింస, సత్యం, ధర్మం అనే ఆయుధాలతో గాంధీజీ భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చారని, కూటమి ప్రభుత్వం హింస, అసత్యాలు, అధర్మంతో పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనే అహంభావంతో.. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలుపాలు చేస్తున్నారన్నారు. దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ, వారి ఆస్తులు, భూములను లాక్కుంటున్నారన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి పరిపాలనను ప్రజల వద్దకు చేర్చారని గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. గాంధీ కలలుగన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాక సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు యానాదయ్య, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్, పార్టీ నాయకులు సీహెచ్ వినోద్, బండి ప్రసాద్, క్రిష్ణమూర్తి, పవర్ అల్తాఫ్, బసవరాజు, షఫీవుల్లా, గురుప్రసాద్, కె.శివయాదవ్ పాల్గొన్నారు.