
శభాష్ పోలీస్
– ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని
కాపాడిన కానిస్టేబుల్స్
ఎర్రగుంట్ల : ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు కాపాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. టౌన్ సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సుందరయ్య కాలనీలో కొవ్వూరు గంగయ్య నివాసం ఉంటున్నారు. అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల హనుమనుగుత్తి గ్రామానికి వెళ్లే దారిలో ఆత్యహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో అక్కడికి పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ అల్ఫ్రెడ్, కానిస్టేబుల్ కాశయ్య వెళ్లారు. సంఘటనను గమనించి వెంటనే గంగయ్య ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌కు కుటుంబ సభ్యులను పిలిపించి ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ రాజారెడ్డి కూడా పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరి మృతి
– ముగ్గురికి గాయాలు
వీరపునాయునిపల్లె : మండలంలోని యన్ పాలగిరి గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడు ప్రమాదంలో రామిరెడ్డి దేవేంద్రారెడ్డి(19) మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వేంపల్లె మండలం ముతుకూరు గ్రామానికి చెందిన ఆసం వీరకుమార్‌రెడ్డి, రామిరెడ్డి దేవేంద్రారెడ్డి కలిసి డీజిల్ కోసం.. బైక్‌లో వీరపునాయునిపల్లెకు వెళ్తున్నారు. అటు వైపు నుంచి వేముల మండలం నారెపల్లెకు చెందిన అన్నా చెల్లెళ్లు జంపల భార్గవ్‌రెడ్డి, ప్రవళిక స్కూటీలో ప్రొద్దుటూరు దసరాకు వెళ్లి తిరిగి నారెపల్లెకు పయనమయ్యారు. యన్ పాలగిరి గ్రామ సమీపంలో వెనుక వైపు నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టడంతో.. ఎదురుగా వస్తున్న స్కూటీకి తగలడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో దేవేంద్రారెడ్డి మృతి చెందాడు. గాయాల పాలైన మిగిలిన ముగ్గురిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసం వీరకుమార్‌రెడ్డి తీవ్ర గాయాలు కావడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్లారు. మృతుడి తండ్రి రామిరెడ్డి గంగిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శభాష్ పోలీస్