
ఒంటిమిట్టలో వైభవంగా శమీవృక్ష పూజ
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామికి గురువారం విజయదశమి సందర్భంగా ఆలయ అర్చకులచే టీటీడీ అధికారులు వైభవంగా శమీ వృక్ష పూజ నిర్విహించారు. ముందుగా ఆలయంలోని సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవారిని రామాలయం నుంచి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, శృంగిశైలిపై ఉన్న ఆస్థాన మండపంలో ఆశీనులను చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు ఆరాధన, చతుర్వేద పారాయణం, శమీ వృక్ష పూజ, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులు గ్రామోత్సవానికి బయలుదేరి, పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. తమ ఇంటి వద్దకు వచ్చిన శ్రీరాముడికి భక్తులు కాయాకర్పూరం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, ఆలయ విజిలెన్స్ అధికారి గంగులయ్య, ఆలయ అర్చకులు వీణారాఘవాచార్యులు, శ్రావణ్ కుమార్, పవన్ కుమార్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రామయ్యను దర్శించుకున్న న్యాయమూర్తి
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి పి.టి ఆశా శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ఆలయ ప్రదక్షణ కావించి, గర్భాలయంలోని మూల విరాట్‌కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె కాసేపు ఆలయ రంగమండపంలో సేద తీరారు. ఆమెను అర్చకులు ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఒంటిమిట్టలో స్వామి, అమ్మవారి గ్రామోత్సవం
జమ్మి చెట్టుకు పూజ చేస్తున్న వేద పండితులు

ఒంటిమిట్టలో వైభవంగా శమీవృక్ష పూజ