చిన్నయ్యా.. మార్పు ఏదయ్యా! | - | Sakshi
Sakshi News home page

చిన్నయ్యా.. మార్పు ఏదయ్యా!

Sep 27 2025 4:45 AM | Updated on Sep 27 2025 7:45 AM

చిన్న

చిన్నయ్యా.. మార్పు ఏదయ్యా!

 రేషన్‌ డీలర్‌ విషయంలో హైకోర్టుకుపులివెందుల ఆర్డీఓ క్షమాపణ

క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి నేతలు చెప్పినట్టే నడుస్తున్న యంత్రాంగం

 

సాక్షి ప్రతినిధి, కడప: అధికార పార్టీ సిఫార్సులకు తలొగ్గి, నిబంధనలకు విరుద్ధంగా.. రేషన్‌షాపు డీలర్లపై చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ విధానాలను అనుసరించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా... రెవెన్యూ అధికారులు నీళ్లు నమిలి క్షమాపణ చెప్పినా.. క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి మార్కు విధానాలనే అనుసరిస్తున్నారు. తాజాగా భద్రంపల్లె రేషన్‌షాపు డీలర్‌ సుభాషిణి సస్పెన్షన్‌ విషయంలో ఆర్డీవో చిన్నయ్య మళ్లీ అవే తప్పులు కొనసాగించారు.

విచారణ లేకుండా.. నోటీసు సైతం ఇవ్వకుండా..
పులివెందుల ఆర్డీవో చిన్నయ్య రేషన్‌షాపు డీలర్లను సస్పెండ్‌ చేయగా.. పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కనీస విచారణ లేకుండా.. నోటీసు కూడా ఇవ్వకుండా డీలర్‌షిప్‌లను రద్దు చేయడాన్ని హైకోర్టు అడ్వకేట్‌ నరహరి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించిన హైకోర్టు వ్యక్తిగతంగా ఆర్డీవో తన ఎదుట హాజరుకావాలని ఉత్తర్వులిచ్చింది. కోర్టులో హాజరైన ఆర్డీవో చిన్నయ్యను రెవెన్యూ నిబంధనలను అనుసరించకపోవడంపై న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఆయన నీళ్లు నమిలారు. చివరకు హైకోర్టుకు ఆర్డీవో చిన్నయ్య క్షమాపణ చెప్పారు. ఇదంతా గత వారంలో చోటుచేసుకుంది. తాజాగా సదరు ఆర్డీవో చిన్నయ్య అవే తప్పులు చేయడం గమనార్హం. ఈనెల 9న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లో భద్రంపల్లె రేషన్‌ డీలర్‌ సుభాషిణి వద్ద నిర్ణీత పరిణామం కంటే 68 కిలోల బియ్యం, 45 కిలోల చక్కెర తక్కువగా ఉన్నట్టు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో డీలర్‌పై చర్యలకు తొండూరు తహసీల్దార్‌ పులివెందుల ఆర్డీవోకు సిఫార్సు చేశారు. వెంటనే పులివెందుల ఆర్డీవో ఈనెల 17న భద్రంపల్లె రేషన్‌ డీలర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెన్షన్‌ తర్వాత షోకాజ్‌ నోటీసు

విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక, మండల రెవెన్యూ అధికారి సిఫార్సుల నేపథ్యంలో డీలర్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని కోరుతూ ఆర్డీవో షోకాజ్‌ నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం అధికారి విచక్షణాధికారంతో చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, భద్రంపల్లె డీలర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఈనెల 17న ఆదేశాలు జారీ చేశారు. అనంతరం 18వ తేదీ వేసి 24వ తేదీన సాయంత్రం షోకాజ్‌ నోటీసు అందజేశారు. పైగా షోకాజ్‌ నోటీసులో 24వ తేదీ సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంటే రేషన్‌ డీలర్‌ వివరణ ఇచ్చే అవకాశమే లేకుండా రెవెన్యూ యంత్రాంగం కుయుక్తులు పన్నినట్టు అవగతమవుతోంది. ఇదివరకే ఆర్డీవోకు హైకోర్టు చీవాట్లు పెట్టినా.. ప్రొసీజర్స్‌ ఫాలో కావాలని స్పష్టంగా ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం తమకు నచ్చినట్టు ఉత్తర్వులు ఇస్తామని రెవెన్యూ యంత్రాంగం తీరు స్పష్టం చేస్తోంది. గత వారంలో హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఆర్డీవో మళ్లీ అవే తప్పులు చేయడం వెనుక.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు పలువురు చెబుతున్నారు.

 

చిన్నయ్యా.. మార్పు ఏదయ్యా! 1
1/1

చిన్నయ్యా.. మార్పు ఏదయ్యా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement