
అగ్రిసెట్‌లో 25వ ర్యాంకు
కడప ఎడ్యుకేషన్: తాజా గా విడుదలైన అగ్రికల్చర్ కామన్ ఎంట్రెన్స్ టెస్టులో (అగ్రిసెట్) జిల్లా విద్యార్థిని చిట్టిబోయిన సుహాసిని రాష్ట్ర స్థాయిలో 25వ ర్యాంకు సాధించింది. ఖాజీపేట మండలం భూమాయపల్లెలోని రైతు చిట్టిబోయిన వెంకటరమణ, మహేశ్వరి కుమార్తె సుహాసిని. సుహాసిని రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పోతుల శివారెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (కేంద్ర కార్యాలయం)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోతుల శివారెడ్డి చెన్నూరు మండలం ఓబులంపల్లెకు చెందిన నాయకుడు. గతంలో ఆయన ఐటీ విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందించారు.
రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్
ప్రెసిడెంట్‌గా సుదర్శన్‌రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన జల్లా సుదర్శన్‌రెడ్డిని రాష్ట్ర లీగల్‌సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో అడ్మిషన్ పొందడానికి రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 31 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ సాంబశివారెడ్డి సంయుక్త ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతి, 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్మీడియెట్‌లో అడ్మిషన్ పొందవచ్చన్నారు. ఇంటర్‌ను ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా ఇంటర్నెట్, మీసేవా, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదనపు సమాచారం కోసం www.apo penschool. ap.gov.in వెబ్‌సైట్ లేదా మీ సమీపంలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో కానీ డీఈఓ కార్యాలయంలో గానీ సంప్రదించాలని వివరించారు.
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠంలోని శ్రీ విరాట్ విశ్వకర్మ భవన్‌లో ఆదివారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణుల సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శ్రీశైలంలోని విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం నిర్వహణపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే అన్ని దేవస్థానాల్లోని విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం నిర్వహణపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం మఠాధిపతి ఎంపికపై తమ అభిప్రాయాలు తెలియజేస్తామన్నారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ మధుసూధనాచారి, తెలంగాణ ఏసీపీ కిరణ్‌కుమార్, హైదరాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇ.వెంకటాచారి, ఏపీ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ తదితరులు విచ్చేస్తారన్నారు. కావున విశ్వబ్రాహ్మణులు పెద్ద ఎత్తున పాల్గొని, ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.