
తగ్గిన జీఎస్టీపై అవగాహన కల్పించాలి
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’పై నెల రోజుల పాటు నిర్వహించాల్సిన సెలబ్రేషన్స్, సీజనల్ కండీషన్స్, పీఎం కుసుమ్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, సోలార్, విండ్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జేసీ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, జిల్లా సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ నోడల్ అధికారి జి. సుమతి, కేఎంసీ కమిషనర్ మనోజ్‌రెడ్డి, మెప్మా పీడీ కిరణ్ కుమార్ హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. 4 వారాల షెడ్యూల్‌ను సవివరంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వల్ల సేవింగ్స్‌పై ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు. జీఎస్టీపై పోస్టర్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు నాలుగు వారాలకు సంబంధించి చేయపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూలును తెలియజేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. నూతన జీఎస్టీ ద్వారా ఆదా అయ్యే అమౌంట్ గూర్చి ప్రజలకు తెలియజేయాలని, ఈ తగ్గిన జీఎస్టీ ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత మేర డబ్బులు ఆదా అవుతాయన్నారు. నాలుగు శ్లాబులు నుంచి రెండు శ్లాబులుగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీపై ముఖ్యంగా గ్రామ సచివాలయాలు, స్వయం సహాయక సంఘాలు గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా కలెక్టర్
డాక్టర్ శ్రీధర్ చెరుకూరి