
అట్టహాసంగా ఇన్‌చార్జి మేయర్ బాధ్యతల స్వీకరణ
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ ఇన్‌చార్జి మేయర్‌గా ముంతాజ్ బేగం బాధ్యతల స్వీకరణ అట్టహాసంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం 5.27 గంటలకు కమిషనర్ మనోజ్‌రెడ్డి ఆమెతో సంతకాలు చేయించి బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు ముంతాజ్‌బేగం స్వగృహం ఉన్న రవీంద్రనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, అపూర్వ కల్యాణ మండపంలో మాజీ మేయర్ సురేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి మేయర్‌గా ఎంపికై న ముంతాజ్ బేగంను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్ సురేష్‌బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముంతాజ్ బేగం మాట్లాడుతూ మాజీ మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేయడం బాధాకరమన్నారు. కడప నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్పొరేషన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమైర్ తదితరులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జమాల్‌వలీ, డాక్టర్ మురాద్, కార్పొరేటర్లు మగ్బూల్‌బాషా, షంషీర్, మల్లికార్జున, బాలస్వామిరెడ్డి, కె.బాబు, డివిజన్ ఇన్‌చార్జులు రెడ్డి ప్రసాద్, బసవరాజు, రామచంద్రయ్య, సుబ్బరాయుడు, డిష్‌జిలాన్, కో ఆప్షన్‌సభ్యురాలు పత్తిరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి, సురేష్‌బాబు, అంజద్‌బాషా