
గోవిందా.. కాపాడు..!
కడప రూరల్ : తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరుపై ఆ పార్టీ తమ్ముళ్లు విసిగిపోయారు. న్యాయం కోసం తిరుగుబావుటా ఎగురవేశారు. పాతకడప కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి చెందిన కార్యకర్తలు బహిరంగంగా రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆ మేరకు సోమవారం స్థానిక దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పాదాల చెంత తమను కాపాడాలంటూ వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగడాలను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులుగా శ్రీనివాసులురెడ్డి, మాధవీరెడ్డిల రాజ్యాంగం నడుస్తోందన్నారు.
నాడు ఎమ్మెల్యేగా మాధవీరెడ్డికి టిక్కెట్ ఇచ్చినపుడు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వద్దనుంచే ప్రచారం చేశామని, ఆమె గెలుపుకోసం కృషి చేశామన్నారు. నేడు ఈ పుణ్యస్థలం నుంచే ఆమె ఆగడాలు భరించలేక తిరుగుబాటు చేస్తున్నామని తెలిపారు. గెలుపుకోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలను బయటపడేశారని అన్నారు. పార్టీలో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగాలన్నారు. చెన్నంశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీనివాసులురెడ్డి, మాధవీరెడ్డి ఎన్నికలకు ముందు ఒకలా, గెలిచిన తర్వాత తమ స్వరూపాన్ని బయటపెట్టారన్నారు. వారి దౌర్జన్యాల నుంచి పార్టీ కార్యకర్తలను కాపాడాలన్నారు. ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సుబ్బలక్షుమ్మ, చిప్పగిరి మీనాక్షి మాట్లాడుతూ పార్టీలో తమకు ఏనాడూ న్యాయం జరగలేదని వాపోయారు. అనంతరం వారు మాకు పెద్ద దిక్కుగా పుత్తా నరసింహారెడ్డి వ్యవహరించాలని కోరుతూ 20కి పైగా వాహనాల్లో కమలాపురం వెళ్లారు.
సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతా – పుత్తా నరసింహారెడ్డి
తమను కలవడానికి వచ్చిన కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయనను కలిసిన కార్యకర్తలు కడప నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ఏకరువు పెట్టారు. తమకు పెద్ద దిక్కుగా ఉండి ముందుకు నడిపించాలని అభ్యర్థించారు. మాకు మీ వల్ల తప్పితే మరెవరి వల్ల న్యాయం జరగదని కోరారు. ఈ సందర్బంగా పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ వేరొకరి నియోజకవర్గంలో జోక్యం చేసుకోలేనని, అయితే పార్టీ కార్యకర్తగా కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ కార్యక్రమంలో వీరయ్య, శివరాం, కొండా సుబ్బయ్య, స్వర్ణమ్మ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

గోవిందా.. కాపాడు..!

గోవిందా.. కాపాడు..!