
హామీ ఇచ్చారు.. అమలు మరిచారు
● ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు, కళాశాల యాజమాన్యం
● 16 నెలలుగా కరుణ చూపని కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. సకాలంలో ఫీజులు చెల్లించకుండా ఏడిపిస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయిబర్స్‌మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.అమలు మరిచారని డిగ్రీ చదివే విద్యార్థులు ఫీజుల కోసం రోడ్డెక్కి ఆందోళన బాటపడ్డారు.
కడప రూరల్/ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా 76 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులు వేలాది మంది ఉన్నారు. ఇప్పటికే చివరి సంవత్సరం విద్యార్థులు వేలాది మంది టీసీలు తీసుకుని బయటికి వెళ్లారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్నా వీరికి కేవలం ఒక టర్మ్‌మాత్రమే అంటే రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు మాత్రమే చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. మిగతా సొమ్మును ఇంతవరకు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులపై ఫీజుల భారం పడుతోంది. ప్రధానంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు టీసీలు తీసుకునే సమయంలో ఫీజులు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోలేక కష్టాలను ఎదుర్కొన్నారు.
ఫీజుల కోసం ఆందోళన
డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు సకాలంలో చెల్లించాలని ఇదివరకే ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఫీజులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాకపోవడంతో సోమవారం విద్యార్థి సంఘాలతోపాటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం ర్యాలీలు, ఆందోళనకు దిగాయి.

హామీ ఇచ్చారు.. అమలు మరిచారు