● రిత్విక్ కంపెనీ మేనేజర్‌పై ఆదివర్గం దాడి
● కార్యాలయం ధ్వంసం
● ఆదిపత్యపోరుతో గండికోట అభివృద్ధికి ఆటంకం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఇది నా అడ్డా. ఇక్కడ నేను తప్ప ఎవరూ పనులు చేయకూడదు. కాదని చేస్తే దాడులు తప్పవనే సంకేతాలను ఆది వర్గం సీఎం రమేష్ నాయుడుకు పంపుతోంది. ఇప్పటికే టి.కోడూరు వద్ద అదాని గ్రూప్ కంపెనీకి చెందిన పవర్‌ప్లాంట్ పనులు సబ్ కాంట్రాక్టర్ కింద సీఎం రమేష్ నాయుడు కంపెనీ చేజిక్కించుకోగా ఎమ్మెల్యే ఆది వర్గం కంపెనీకి చెందిన ప్రతినిధులు, అధికారులపై దాడులు చేసి భయంభ్రాతులకు గురి చేశారు.
గండికోట టూరిజం అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లను రూ.78 కోట్లతో రిత్విక్ కంపెనీ చేజిక్కించుకుంది. దీంతో ఆదినారాయణరెడ్డి, ఆయన వర్గం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను శాసన సభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో మరొకరు వచ్చి కోట్లాది రూపాయలు పను లు చేయడం ఏమిటని మదన పడుతున్నారు. ఎలాగైనా రిత్విక్ కంపెనీ ప్రతినిధులను తమ అదుపులోకి తెచ్చుకునే విధంగా గత కొంత కాలంగా గండికోటలో జరుగుతున్న పనులకు స్థానిక నాయకులు అడ్డు తగులుతూ వచ్చారు. దీంతో గండికోట గ్రా మంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది.
ఆరు వాహనాల్లో వచ్చారు.. దాడి చేశారు
ఆది వర్గానికి చెందిన వారు ఆరు వాహనాల్లో గండికోటకు వెళ్లి రిత్విక్ కంపెనీపై దాడులు చేశారు. సోమ వారం మధ్యాహ్నం ఆదినారాయణరెడ్డి వర్గీయులు పోలీసుల సమక్షంలోనే దాడులు చేసినట్లు సమాచారం.పోలీసులు ముందుకు రాకండి, ఫొటోలు, వీడియోలు కూడా తీయవద్దు. అంటూ రిత్విక్ కంపెనీపై రాళ్లదాడి చేసి మేనేజర్‌ను సైతం కొట్టారు. మరో ప్రాంతంలో ఉన్న జేసీబీని పగుల గొట్టారు. స్థానికంగా ఉన్న పోలీసులు మేము ఏమి చేయగలం, తమ ప్రాణాలు చిన్నవి అంటూ సెలవిస్తున్నారు. దాడి అనంతరం అర్బన్ సీఐ నరేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఆది వర్సెస్ సీఎం రమేష్