● జిల్లాలో నాలుగు రోజుల నుంచి వర్షాలు
● జోరుగా ప్రవహిస్తున్న పెన్నా, కుందూనదులు
● 942 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
● నీటి నిల్వలు, దోమలతో అల్లాడుతున్న జనం
కడప అగ్రికల్చర్/వేముల/పెనగలూరు : కడప జిల్లా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వద్దన్నా వర్షం కురుస్తూ రైతులను బెంబేలెత్తిస్తోంది. చాలా ప్రాంతాల్లో కుంటలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వేంపల్లిలో అత్యధికంగా శుక్రవారం రాత్రి 96.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎర్రగుంట్లలో 84, పెద్దముడియంలో 85, జమ్మలమడుగులో 80.4, వీఎన్‌పల్లిలో 73.4, వేములలో 72.4, చక్రాయపేటలో 67.2, ప్రొద్దుటూరులో 57.8చ, పులివెందులలో 36, ముద్దనూరులో 35.4, తొండూరులో 32.2, ఒంటిమిట్టలో 29, మైలవరంలో 28.6, సికెదిన్నెలో 22.3, కడపలో 17.2, లింగాలలో 15.2, వల్లూరులో 14.4, సింహాద్రిపురంలో 13.2, రాజుపాలెంలో 12.2, పెండ్లిమర్రిలో 9.2, కమలాపురంలో 8.8, చాపాడులో 8.4, కొండాపురంలో 8.2, ఖాజీపేటలో 7.4, సిద్దవటంలో 7.2, చెన్నూరులో 2.2, దువ్వూరులో 2.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
● ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు వలసపల్లి, చిలంకూరు, మాలపాడు వంకలు శుక్రవారం ఉద్ధృతంగా ప్రవహించాయి, కోడూరు వంకకు వరద నీరు చేరడంతో వేంపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రగుంట్లలోని 33 కేవీ, 320 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్లతోపాటు డీఈఈ కార్యాలయంలోకి నీరు చేరింది.
● రాజుపాలెం మండలం పర్లపాడు ఎస్సీ కాలనీలో జలమయమైయింది. రాజుపాలెం, వెంగలాయపల్లి గ్రామాల మధ్య మడవంకకి వర్షపునీరు భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
● గత నాలుగేళ్లుగా నీరు లేక వెలవెలబోయిన చెరువు ఒంటిమిట్ట చెరువుకు వరదనీరు వచ్చి చేరుతోంది.
● పెన్నా, కుందూ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నీరు అధికంగా చేరడంతో సిద్దవటం వద్ద లో లెవల్ బ్రిడ్జిపై నీరు పొంగి ప్రవహించింది.
తోటలలో కుళ్లిపోతున్న ఉల్లిగడ్డలు
జిల్లాలోని పెద్దముడియం, ప్రొద్దుటూరు, కమలాపురం, వల్లూరు, ఎర్రగుంట్ల, వేంపల్లి మండలాలలోని 32 గ్రామాల పరిధిలో 1101 మంది రైతులకు సంబంధించిన 942.38 హెక్టార్లలో వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, సోయాబీన్, మినుము, పత్తి పంటలకు ప్రాథమికంగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా తయారు చేశారు. ఇందులో భాగంగా 662.2 హెక్టార్లలో వరి, 10 హెక్లార్లలో జొన్న, 10 హెక్టార్లలో మొక్కజొన్న, 137.68 హెక్టార్లలో వేరుశనగ, 11.6 హెక్టార్లలో సోయాబీన్, 28.2 హెక్టార్లలో మినుము, 4.5 హెక్టార్లలో పత్తిపంటలు దెబ్బతిన్నాయి. అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ఉల్లి, పూలు పంటలు దెబ్బతిన్నట్లు పలువుర ఉద్యాన రైతులు తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో 3660 ఎకరాలలో ఉల్లి పంట సాగైంది. ఈ ఏడాది జూన్ మొదటివారంలో పంటలు వేయడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు భావించారు. వ్యాపారులు కొనుగోలుకు మొగ్గు చూపకపోగా, ప్రభుత్వం మొండిచేయి చూపింది. రైతులు వేచి చూశారు. ఇంతలోనే వర్షాలు కురవడంతో తోటల్లోనే ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. 1500 ఎకరాల్లో ఉల్లి పంట దెబ్బతిందని ఉద్యాన అధికారులు తేల్చారు. పెద్దజూటూరులో చెన్నకేశవరెడ్డి 3.50ఎకరాలలో సాగు చేసిన అరటి పంట వర్షాలకు నేల రాలింది.
సోమశిల జలాలతో మునిగిన పొలాలు
పెనగలూరు: సోమశిల వెనుక జలాలు పెరగడంతో సిరివరి గ్రామానికి చెందిన వందల ఎకరాల పంట నీట మునిగింది. మామిడి తోటల్లోకి నీరు చేరడంతో చెట్లు చనిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 72 టీఎంసీలు నిల్వచేశారు. దీంతో సిరివరం, ఎన్‌ఆర్.పురం గ్రామంలోని చాలా పొలాలకు నీరు చేరింది. వారం పది రోజులలో కోసేందుకు వరి ప ంట సిద్ధంగా ఉండగా. నీట మునగడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రగుంట్ల 33 కేవీ సబ్‌స్టేషన్‌కు చేరిన వర్షం నీరు
ఎర్రగుంట్లలో వర్షపు నీటికి దెబ్బతిన్న పత్తి పంట
ఉల్లి గడ్డలు కుళ్లిపోతున్నాయి
నేను రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. రూ.1.50 లక్షల మేర పెట్టుబడి పెట్టాను. పంటకాలం పూర్తికావడంతో ఉల్లిగడ్డలు పీకివేశా. వర్షాలకు తడిచి ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాను.
– చలమారెడ్డి, ఉల్లి రైతు, చింతలజూటూరు
ధర లేక అమ్మలేదు
ఉల్లి సాగు చేసి పంట కాలం పూర్తయింది. నాలుగు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాను. రూ.3 లక్షలకు పైనే పెట్టుబడులు పెట్టాను. ధరల కోసం ఎదురుచూస్తున్నా. ఇంతలోనే వర్షాలు కురవడంతో గడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇలాగే వర్షాలు కురిస్తే పంట వదులుకోవాల్సిందే.
– ద్వారకనాథ్‌రెడ్డి, ఉల్లిరైతు, వేల్పుల
ఉల్లి తోటలు దెబ్బతింటున్నాయి
తుపాన్ వర్షాలతో ఉల్లి తోటలు దెబ్బతింటున్నాయి. తోటలలో పీకి వేసిన ఉల్లి గడ్డలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పీకి వేయని ఉల్లిగడ్డలు కూడా భూమిలో కుళ్లిపోతున్నాయి. వర్షాలతో ఉల్లి రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. 1500ఎకరాలలో పంట దెబ్బతింది.
– రాఘవేంద్రారెడ్డి,
ఉద్యాన శాఖాధికారి, పులివెందుల
వదలనంటోన్న వాన
వదలనంటోన్న వాన
వదలనంటోన్న వాన
వదలనంటోన్న వాన
వదలనంటోన్న వాన
వదలనంటోన్న వాన
వదలనంటోన్న వాన
వదలనంటోన్న వాన