
ప్రొద్దుటూరులో లేఖ కలకలం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ప్రొద్దుటూరు పట్టణంలో కొందరు బ్లాక్ మెయిల్ చేస్తూ జేబులు నింపుకొంటున్నారని పట్టణ ప్రముఖులపై ఏకే.రామాంజనేయులు రాసిన లేఖ శనివారం కలకలం సృష్టించింది. లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో బీజేపీ నాయకుడు గొర్రె శ్రీనివాసులు బ్లాక్ మెయిల్ దందాకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రెండు దశాబ్దాల కిందట అగస్త్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణ వివాదంలోనూ, మిట్టా పాపయ్య సత్రం, నందినీ క్లాత్ మార్కెట్ విషయంలోనూ వివాదాలను ఆసరాగా తీసుకుని గోసంగి వెంకటసుబ్బారెడ్డి, గొర్రె శ్రీనివాసులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడగా వారికి బుశెట్టి రాంమోహన్‌రావు సహకరించారని ఆరోపించారు. ధారా అపార్ట్‌మెంట్ నిర్మాణంపై లెక్కలేనని పిటీషన్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించారని ఆరోపించారు. డీఏడబ్ల్యూ కళాశాల వివాదంలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేపైనా డీఎల్.రవీంద్రారెడ్డితో ఫిర్యాదు చేయించి రూ.50 లక్షల వరకూ వసూలు చేశారన్నారు. గోపీ రైస్‌మిల్లుపై వందల కొద్దీ పిటీషన్లు, ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టి రూ.8కోట్లు అక్రమంగా సంపాదించారని, బొల్లవరంలో పల్లేటి సుహాసినిని మఽభ్యపెట్టి డబ్బు సంపాదించారని ఆరోపించారు. ఇందులో టీడీపీ నాయకుడు ఉక్కు ప్రవీణ్ అనుచరుడు వాటర్‌ప్లాంట్ రాము, నీలకంఠారెడ్డి ఉన్నారన్నారు. చౌటపల్లె నికల్సన్ దొరకు చెందినదిగా చెప్పబడుతున్న మూడు ఎకరాల స్థలాన్ని దొంగగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేయాలని యత్నించినట్లు పేర్కొన్నారు. నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, మరికొందరు వేసిన వెంచర్లపై ఆర్టీఐ యాక్ట్ పెట్టి బెదిరించారన్నారు. 2023లో రాజా ఫౌండేషన్‌పై వారి కళ్లు పడ్డాయని, చిన్నజీయర్‌స్వామిని పరిచయం చేసుకుని కమిటీలో తమ పేర్లను ఎక్కించుకున్నారని, తమకు రూ.75 కోట్ల విలువైన భూములను అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుడు గొర్రె శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ అక్రమంగా రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేని పక్షంలో ఆరోపణలు చేసిన వ్యక్తులు రాజకీయాలకు ముగింపు పలకాలని కోరారు. శివాలయం సెంటర్ వద్ద బహిరంగ చర్చా వేదికకు తాము సిద్ధమన్నారు. కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి ఆరోపణలు చేయించారని, దందాలు ఎవరు చేశారో ప్రజలకు తెలుసునన్నారు. గోసంగి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16న హెడ్ పోస్టాపీసులో లేఖ పోస్టు చేశారని, ఎక్కడి నుంచి లేఖ వచ్చింది అడ్రెస్ లేదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేశారన్నారు. అనంతరం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమపై ఆరోపణలు చేసిన వారిఫై విచారించాలని కోరారు.
బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు
వసూలుచేస్తున్నారని ఆరోపణ