
ముగ్గురిపై చీటింగ్ కేసు
కడప అర్బన్ : కడప నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయభాస్కర్‌రెడ్డితోపాటు కుమార్తె రూప తన్మయి, సుజిత్‌కుమార్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రామకృష్ణ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. అరవింద్‌నగర్‌కు చెందిన నిత్య పద్మావతి 2019లో ఐదు ఆయిల్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ బాధ్యత విజయభాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఆయన నిత్య పద్మావతి దగ్గర సంతకాలు చేసిన చెక్కు, లెటర్ ప్యాడ్‌లను నమ్మకంగా ఇప్పించుకున్నాడు. కుట్రపన్ని దాదాపు రూ.90 లక్షల మేర తాను, తమ ఇద్దరు పిల్లల ద్వారా డబ్బు డ్రా చేసుకుని అవసరాలకు ఖర్చు చేసుకున్నారు. చివరకు ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించిన ఈఎంఐలను తన చేతనే కట్టించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు మైనర్ల అరెస్టు
వేంపల్లె : స్థానిక పిల్లస్వామి గుట్ట సమీపంలోని జగనన్న కాలనీలో జరిగిన చోరీ కేసులో బంగారు రికవరీ చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన జగనన్న కాలనీలో వాణి తన ఇంటికి తాళం వేసి వెళ్లారు. అదే కాలనీకి చెందిన ఖాదర్‌వలి, మరో ఇద్దరు మైనర్లు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో బంగారు, వెండి చోరీ చేశారు. విచారించి కడప–పులివెందుల బైపాస్ రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్, సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 66.90 0గ్రాముల బంగారు అభరణాలు, 118 గ్రాముల వెండి గొలుసులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
పులివెందుల లయోలా
కళాశాల అధ్యాపకుడి ప్రతిభ
పులివెందుల టౌన్ : అంతర్జాతీయ సదస్సులో పులివెందుల లయోలా డిగ్రీ కళాశాల జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఉదయ్‌కుమార్ ప్రతిభ చూపారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రేవా యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో 9 దేశాల శాస్త్రవేత్తలు పాల్గొని 200 ప్రదర్శన పత్రాలు సమర్పించారు. లయోలా కళాశాల అసిస్టెంట్ అధ్యాపకుడు ఉదయ్ కుమార్ లైఫ్ సైన్స్ విభాగంలో సమర్పించిన ఉపాధ్యాయ కేటగిరీ పత్రం ద్వితీయ బహుమతికి ఎంపికై ంది. అతిథుల నుంచి ఆయన బహుమతి అందుకున్నారు. ప్రిన్సిపల్ జోజిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వనచిన్నప్ప ఉదయ్‌ను అభినందించారు.