
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు
మైదుకూరు : తనను బెదిరించి తన మోటార్ బైక్‌ను అగంతుకుడు ఎత్తుకెళ్లాడని ఓ భవన నిర్మాణ కార్మికుడు చేసిన ఫిర్యాదు ఓ అంతర్ రాష్ట్ర దొంగను పట్టించింది. బద్వేల్ ఎన్జీఓ కాలనీ వాసి బ్రహ్మాదేవి రాజశ్రీ గణేష్‌ను బ్రహ్మంగారిమఠం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షల విలువచేసే పది మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని వివేకానంద కాలనీకి చెందిన షేక్ హుస్సేన్‌షా బేల్దారిగా పనిచేస్తున్నారు. బ్రహ్మంగారిమఠం ఈశ్వరీదేవి గుహ వద్ద ఈ నెల 16న పనులకు వెళ్లి కొద్ది దూరంలో బైక్ పార్కింగ్ చేశాడు. సాయంత్రం వచ్చి చూడగా.. నిందితుడు రాజశ్రీ గణేష్ తన బైక్‌ను స్టార్ట్ చేస్తుండడడంతో హుస్సేన్‌షా ఎందుకు స్టార్ట్ చేస్తున్నావని ప్రశ్నించాడు. పక్కకు తప్పుకోకుంటటే చంపేస్తానంటూ చాకుతో బెదిరించి బైక్‌లో పరారయ్యాడు. బాధితుడు బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితుడు రాజశ్రీ గణేష్‌ను పోలీసులు అనుమానించి విచారించారు. విచారణలో హుస్సేన్‌షా మోటార్ బైక్ అని తేలడంతో మరింత విచారణ చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణలోని పలు స్టేషన్ల పరిధిలో తొమ్మిది మోటార్ బైక్‌లు చోరీ చేసినట్లు తెలిసింది. ఓ పాడుబడిన షెడ్‌లో నిందితుడు దాచిన పది మోటార్ బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక కడప, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు నిందితుడిపై కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న సబ్బందిని డీఎస్పీ అభినందించారు. కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, హుస్సేనయ్య, బ్రహ్మేంద్రలకు రివార్డులను అందజేశారు.
10 మోటార్ బైక్‌లు స్వాధీనం