
దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం
ప్రొద్దుటూరు కల్చరల్: శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో 136వ దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశామని..ఈ ఏడాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నామని ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్ రావు తెలిపారు. ఆలయంలో శనివారం ఉత్సవ వివరాలను కమిటీ సలహాసభ్యులు బుశెట్టి రాజశేఖర్, ఎన్‌వీ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరన్నవరాత్రుల సందర్భంగా రోజూ అమ్మవారి అలంకారాలు నిత్యనూతనంగా భక్తులకు కనువిందు చేస్తాయన్నారు. సోమవారం దసరా ప్రారంభం సందర్భంగా ఉదయం వాసవీకన్యకా పురాణాన్ని తెచ్చే వేడుకలో హర్యాణా భంభంభోలే అఘోరాలు, భోపాల్ శివశక్తి డ్రమ్స్, కోదండరామ కోలాటం ఉంటుందన్నారు. 29న బిందె సేవ రోజున చిక్‌మంగుళూరుకు చెందిన కళాకారుల ప్రదర్శనలు, అక్టోబరు 2న విజయ దశమి సందర్భంగా శమీదర్శనం, తొట్టి మెరవణి వేడుకలో పాలకొల్లు బ్యాండ్, కోలాటం, డూప్స్, హర్యాణా కళాకారుల వేషధారణలు, కేరళ సింగారిమేళం, కాంతార కళాకారుల ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు అలరిస్తాయన్నా రు. అలాగే లోకకళ్యాణార్థం రోజూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజాకార్యక్రమాలు, వేద పఠనం, జపహోమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది దసరా 11 రోజులు రావడంతో 9వ రోజున అమ్మవారిని బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తున్నామన్నారు. 4 రోజులు సినీ డైరెక్టర్ గోపి అమ్మవారికి ప్రత్యేక సెట్టింగ్‌లు వేస్తున్నారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు దేవీ శరన్నవ రాత్రి వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, మల్లెంకొండు ప్రతాప్, కోశాధికారి జాలాధి పరమేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.