
టీడీపీ, జనసేన దళిత వ్యతిరేక పార్టీలు
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, సమావేశానికి హాజరైన నాయకులు , పార్టీ శ్రేణులు
కడప కార్పొరేషన్: సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి అని.. టీడీపీ, జనసేన సిద్ధాంతం, భావజాలంతో దళితులకు నష్టమని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. విజయవాడలోని 125 అడుగుల డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట లక్ష మంది దళితులతో ప్రదర్శన చేయనున్నామని ఆయన వెల్లడించారు. శనివారం పాతరిమ్స్ ఆవరణంలోని బీసీ భవన్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 35 మంది సభ్యులతో జిల్లా కమిటీతో పాటు ఏడు నియోజకవర్గాల్లో, మున్సిపాలిటీల్లో, 36 మండలాల్లో, పంచాయతీల్లో కమిటీలు పూర్తి చేయాలన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా...అని తన మనసులో దళితులపై ఉన్న వివక్షను చంద్రబాబు బయటపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా పవన్ మాట్లాడకుండా దళితులపై వ్యతిరేకతను చాటుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీతోనే దళితులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల రాజకీయంగా దళితులకు నష్టం జరిగిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 38 సంక్షేమ పథకాల ద్వారా దళితులకు కోట్లాది రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు.
చంద్రబాబు దళిత ద్రోహి
వైఎస్ కుటుంబానికి దళితులంతా బంధువులని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముద్దుబిడ్డలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి అన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, ఆయన టక్కుటమారాలను దళితులు గమనించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో
విజయమే లక్ష్యంగా పనిచేయాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయరు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు.
● కూటమి ప్రభుత్వ పాలనలో దళితులు ఆత్మ గౌరవంతో బతకడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు అన్నారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లతోపాటు 15 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్లను చేసిన ఘనత వైఎస్ జగన్‌దేనని చెప్పారు.
● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ, భద్రత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. కూటమి పాలనలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని, దళితులపై దాడులు ఎక్కవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
● దళితులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్ అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దళితులకు గౌరవం లభించిందని, కూటమి ప్రభుత్వంలో ఆ గౌరవం కరువైందన్నారు.
● 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమిపాలవడంతో దళితుల బతుకులు దుర్భరమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా పరిశీలకులు కె. చెంగయ్య అన్నారు. దళితుల జీవితాలు బాగుపడాలంటే ఓటు అనే ఆయుధంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దళితుల సత్తా చూపాలని పిలుపునిచ్చారు.
దళితుల సంక్షేమం
వైఎస్సార్, జగన్ హయాంలోనే...
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల పాలనలోనే దళితుల సంక్షేమం, అభివృద్ధి జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు వంటి పథకాల వల్ల దళితులకు ఎక్కువగా లబ్ధి చేకూరిందన్నారు.
● వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, దళిత నాయకులు సీహెచ్ వినోద్ కుమార్, ఎం.సుబ్బరాయుడు, కె. శరత్‌బాబు, డేనియల్ ప్రదీప్, బి. మరియలు, కె. బాబు, బండి ప్రసాద్, త్యాగరాజు, ఆర్. చెన్నయ్య తదితరులు మాట్లాడారు. అంతకుముందు వారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఎస్. యానాదయ్య, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, గల్ఫ్‌కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు బి. వేణుగోపాల్ నాయక్, మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, పుల్లయ్య(బద్వేల్), చిట్టిబాబు(జమ్మలమడుగు), భాస్కర్(పులివెందుల) తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ భావజాలానికి అనుగుణంగా జగన్ పాలన
దళితులంతా సంఘటితంగా ఉండి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధాలతో అఽధికారంలోకి వచ్చిందని, వైఎస్సార్‌సీపీపై బురదజల్లడమే లక్ష్యంగా పనిచేస్తోందని మండిపడ్డారు. విద్య ఒక్కటే మన జీవితాల్లో మార్పు తెస్తుందని అంబేడ్కర్ చెప్పారని, వైఎస్ జగన్ కూడా విద్య, వైద్యాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి పునాది రాళ్లుగా ఉపయోగించారన్నారు.
కూటమి రాకతో ఆ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా నష్టం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు

టీడీపీ, జనసేన దళిత వ్యతిరేక పార్టీలు

టీడీపీ, జనసేన దళిత వ్యతిరేక పార్టీలు