
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
పులివెందుల: రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగనన్న పేదల కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుని అందుకు తగిన కార్యాచరణతో నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే దాదాపు పూర్తయిన మెడికల్ కళాశాలలను పూర్తి కాలేదంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేట్‌పరం చేయడానికి సిద్ధమయ్యాడన్నారు.ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలవల్ల పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు, అలాగే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా పోతుందన్నారు. పులివెందులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు వచ్చి పరిశీలించి ఇక్కడ మెడికల్ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని భావించి 50మెడికల్ సీట్లను మంజూరు చేయడం కూడా జరిగిందన్నారు. అయితే పులివెందులపై ఉన్న వివక్షతతో మంజూరైన మెడికల్ సీట్లను కుంటి సాకులు చెప్పి వెనక్కి వెళ్లేలా చేసిన నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని ఎంపీ అన్నారు. రాష్ట్రంలోని 17మెడికల్ కళాశాలలకు సంబంధించిన లక్ష కోట్ల ఆస్తిని ఈ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం శోచనీయమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అడ్డుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
వైఎస్సార్‌సీపీలోకి 12 కుటుంబాలు
మండల కేంద్రమైన వేముల ఎస్సీ కాలనీలోని టీడీపీకి చెందిన 12 కుటుంబాల వారు బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డిల ఆధ్వర్యంలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చాగలేటి ప్రతాప్, అలవలపాటి గంగాధర, దారతోటి గుంటెన్న, రాచూరు రాఘవ, కొండూరు శ్రీనివాసులు, ఉలిమెల్ల గంగాధర్, గొందిపల్లె గంగాధర్, గొందిపల్లె కరుణాకర్, చాగలేటి పుల్లయ్య, గొందిపల్లె సుమంత్, కొట్టం శ్రీరాములు, గొందిపల్లె రామాంజులతోపాటు మరికొంతమంది ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతూ ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తుండటంతో విసుగు చెందామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిల ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బాగా అమలయ్యాయని, రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో పార్టీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చలపతి, నాగప్ప, గంగాధర తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన వేముల మండల టీడీపీ నాయకులు
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం