
19న చలో పులివెందుల మెడికల్ కాలేజ్
– వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్ : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. .ఈ నెల 19న చేపట్టిన చలో పులివెందుల మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా, వాలంటరీ విభాగాల అధ్యక్షులు, సభ్యులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని, పది మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేసి సుందరంగా తీర్చిదిద్దారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటిని ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. గత ప్రభుత్వంపై బురద జల్లుతూ ఎలాంటి సౌకర్యాలు లేవని దుష్ప్రచారం చేయడం తగదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలను మెడికల్ కాలేజీ వద్దకు తీసుకుపోయి అక్కడ ఉన్న వసతులు, సౌకర్యాలను, వాస్తవ పరిస్థితులను తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్‌కుమార్, జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయి దత్త, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు వివేక్, నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, నగర వాలంటీర్స్ విభాగం అధ్యక్షుడు వంశీ, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి సునీత, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సందీప్ రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం
రాష్ట్ర అధికార ప్రతినిధిగా రుతిక్
కడప.కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కె.రుతిక్ నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన కె.రుతిక్ వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2019 నుంచి వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా సేవలందిస్తున్నారు. రుతిక్ పోరాట పటిమను గుర్తించిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అతడిని ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. బుధవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా రుతిక్ కలిసి మాట్లాడారు.
పది నెలలుగా విధులకు డుమ్మా
చింతకొమ్మదిన్నె : మండలంలోని విశ్వనాథపురం–1 అంగన్వాడీ టీచర్ వి.అరుణ పది నెలలకు పైగా విధులకు హాజరు కావడం లేదని స్థానికులు తెలిపారు. అంగన్వాడీ టీచర్ పది నెలలపాటు విధుల్లోకి రాకపోయినప్పటికీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ పీడీ రమాదేవి వివరణ కోరగా.. అంగన్వాడీ టీచర్ అరుణ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్నారని తెలిపారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వెంకటలక్ష్మి, స్థానిక మహిళా పోలీసు కలిసి విచారించినా ఆమె ఫోన్‌లో అందుబాటులో లేరన్నారు. బాడుగకు ఉంటున్న ఇంటికి మెమోలు అంటించామని, వేతనం ఆపివేశామని ఆమె తెలిపారు. త్వరలో ఆమెను టర్మినేట్ చేయనున్నట్లు తెలిపారు.

19న చలో పులివెందుల మెడికల్ కాలేజ్