
ఎమ్మెల్యే పీఏ అండతోనే మెప్మాలో అక్రమాలు
ప్రొద్దుటూరు : అధికార పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యక్తిగత పీఏ స్వామి అండతో మెప్మాలో అక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ చాంబర్‌లో విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడుతూ మెప్మా పరిధిలో 30వేల మంది డ్వాక్రా సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెప్మా మై స్టోర్ యాప్ ద్వారా టీఈ మహాలక్ష్మి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మార్కెట్‌లో లభించే అగరబత్తీలు, ఊరగాయలు, కారంపొడి, పేలాల ముద్దలు, టవాళ్లు తీసుకువచ్చి యాప్ ద్వారా విక్రయిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులోని సంస్థతో ఒప్పందం చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజలకు ఎక్కువ ధరకు అంటగడుతున్నట్లు తెలిసిందన్నారు. 30 ్ఠ60 సైజు టవాల్ ధర రూ. 55కు తెచ్చి యాప్ ద్వారా రూ.110లకు, 250 గ్రాముల నిమ్మకాయ ఊరగాయ ప్యాకెట్ ధర రూ.60కి తెచ్చి రూ.110కి విక్రయిస్తున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 90 మంది ఆర్పీలు ఉండగా ప్రతి ఆర్పీకి వాటిని అమ్మాలంటూ టార్గెట్ విధించారన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత పీఏ స్వామి అండతోనే ఇదంతా జరుగతోందన్నారు. మూడు పేలాల ముద్దల ప్యాకెట్ రూ.60కు తెచ్చి రూ..120కి అమ్ముతున్నారన్నారు. తమ కార్యాలయంలో కంప్యూటర్లు ఏర్పాటుచేయాలని మహాలక్ష్మి ఆర్పీల వద్ద రూ.1000 చొప్పున రూ.90వేలు వసూలు చేస్తున్నారన్నారు. తన మాట వినని ఆర్పీలను టీఈ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు. మెప్మా కుంభకోణంలో టీఈ రూ.20 లక్షల వరకు అక్రమంగా సంపాదించినట్లు తెలిసిందన్నారు. గృహాలకు సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని ఆ కంపెనీతో లాలూచీపడి డ్వాక్రా మహిళలతో ఇంటింటా ప్రచారం చేయిస్తున్నారన్నారు. మెప్మాలో జరిగిన ఈ కుంభకోణంపై మెప్మా పీడీ, ఎండీలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గరిశపాటి లక్ష్మీదేవి, పాతకోట మునివంశీధర్‌రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ద్వార్శల గురునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపల్ వైస్ చైర్మన్
పాతకోట బంగారు మునిరెడ్డి