
7 నుంచి భవ్య గుజరాత్ యాత్ర
కడప కోటిరెడ్డిసర్కిల్: భారతీయ రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భవ్య గుజరాత్ యాత్రను చేపట్టనున్నామని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. కడప రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో యాత్రకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. అక్టోబర్ 7 నుంచి 10 రోజులపాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చన్నారు. ద్వారక, నాగేశ్వర్ ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, సూర్య దేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నది తీరం, యునెస్కో వారసత్వ స్థలం రాణి కి వావ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక క్షేత్రాలను ఈ యాత్రలో సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఈ రైలు రేణిగుంట నుంచి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట చేరుతుందని వివరించారు. ప్రయాణికులకు ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వెజిటేరియన్ భోజనం, వాటర్ బాటిల్ వంటి సౌకర్యాలతోపాటు ప్రతి యాత్రికుడికి ప్రయాణ బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.18,400.. 3 టైర్ ఏసీ టిక్కెట్ రూ.ఽ30,200.. 2 ఏసీ టిక్కెట్ ధర రూ.39,900 గా నిర్ణయించారని తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం బి.యేసయ్య (9281495853), కె.పవన్‌కుమార్ ( 8287932313)లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ ప్రతినిధులు భాస్కర్ బాబు, యేసయ్య, ఈరన్న, దుర్గాప్రసాద్, ఇన్‌చార్జి స్టేషన్ మేనేజర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.