
1050 మెట్రిక్ టన్నుల యూరియా రాక
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడప జిల్లాకు మంగళవారం 1050 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ తెలిపారు. ఆయన కడప ఏవో సురేష్‌కుమార్‌రెడ్డితో కలిసి జిల్లాకు వచ్చిన యూరియాను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన మొత్తాన్ని జిల్లాలోని రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 69653 మెట్రిక్ టన్నుల ఎరువులు అసవరం కాగా ఇప్పటి వరకు 36915.26 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 25170.97 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో యూరియా 2117.80 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3268, కాంప్లెక్స్‌లు 15727.59, యంఓపీ 1990.80 మెట్రిక్ టన్నులతోపాటు యస్‌యస్‌పీ 2066.79 మెట్రిక్ టన్నులు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో సాగు చేసిన పంటలకు యూరియా సరఫరా అవుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
● కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వినతి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని రైతుల అవసరాలకు తగినంత యూరియా, డీఏపీ అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి కోరారు. మంగళవారం ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతిపత్రం పంపారు. ఈ ఏడాది ఎగువన కురిసిన వర్షాల కారణంగా కేసీ కెనాల్‌తోపాటు ఇతర రిజర్వాయర్లకు నీరు వచ్చిందన్నారు. దీంతో రైతులు ప్రధానంగా వరి, పత్తి, గడ్డి కయ్యలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారన్నారు. పాస్పేట్, యూరియా కొంత మేర జిల్లాకు వచ్చినప్పటికీ రైతులకు అందడం కష్టంగా మారిందన్నారు. ఇప్పటికి జిల్లాలో చాలా చోట్ల రైతులు క్యూలైన్లలో రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. యూరియా బస్తా రూ. 266తో విక్రయించాల్సి ఉండగా, బయటి మార్కెట్‌లో రూ 350లపైనే అమ్ముతున్నారని తెలిపారు.