కడప అర్బన్ : జిల్లాలో పోలీస్ శాఖ పట్ల ప్రజలలో మరింత నమ్మకం పెంపొందించేలా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని జిల్లా నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలతో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు, మీడియా, ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్పీ(ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు దారెడ్డి భాస్కర్ రెడ్డి, శివ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం తగదు
జిల్లాలో ప్రజా సమస్యలపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని, విధుల్లో అలసత్వం ఉండరాదని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఇతర ప్రత్యేక విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ జిల్లాలో పర్యటించి శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేస్తామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు.
● పోలీసుల అధికారుల సంఘం నాయకులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కడప జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు దూలం సురేష్, వైస్ ప్రెసిడెంట్ శంకర్,స్టేట్ కో– ఆప్షన్ నెంబర్ ఎస్‌ఎం. డి. షఫీవుల్లా, ఆర్ ఎస్ ఐ రామస్వామి రాజు, ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ ఏప్రిన్, మాధవి లత పాల్గొన్నారు.
● జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు ప్రజాసమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన
షెల్కే నచికేత్ విశ్వనాథ్