
ఊరికి దారి దొరికింది.. ఉపకారికి బిల్లు దక్కలేదు !
కడప సిటీ : ఆ గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలు పైబడి అయ్యింది. రాకపోకలకు గ్రామసమీపాన ఉన్న మొగమూరు వంక ప్రవాహంతో సమస్యలు తీవ్రతరంగా ఉండేవి. ఈ వంక పెద్ద ఎత్తున ప్రవహిస్తే మూడు రోజుల వరకు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయేవి. ఈ సమయంలో ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే మృతదేహాలను వంకలో ప్రవహించే నీటిలోనే వదిలేసే దుస్థితి. ఆ గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ వంక ప్రవాహం పెద్ద ఆటంకంగా మారి చదువులు కుంటుపడేవి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి చొరవతో ఆ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆ గ్రామానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లె కాదు... వైఎస్సార్ కడప జిల్లాలోని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెకు అతి దగ్గరలో ఉన్న ఓబుల్‌రెడ్డిపల్లె.
200 సంవత్సరాలుగా ఉన్న సమస్య
ఓబుల్‌రెడ్డిపల్లె గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలకు పైగా అయ్యింది. అప్పటి నుంచి 2023 వరకు ఆ గ్రామ సమీపంలోని మొగమూరు వంక ప్రభావంతో వర్షాకాలంలో అన్ని విధాలుగా ఇబ్బందులు ఉండేవి. అప్పటి నుంచి 2022 వరకు ఆ గ్రామ సమస్యను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న గ్రామమైనప్పటికీ ఏ నాయకులు వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపలేదు.
పద్మవ్యూహంలాంటిది
ఈ వంక వస్తే ఓబుల్‌రెడ్డిపల్లె వాసులకు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఉండేది. అటు పాలగిరికి వెళ్లి మెయిన్‌రోడ్డుకు వచ్చేందుకు యేరు అడ్డు పడేది. నాగూరు మీదుగా వెళ్లి వేంపల్లెకు వెళ్లాలంటే పాములూరు వంక అడ్డుగా ఉండేది. ఈ వంక ప్రవాహం వస్తే ఎటువంటి రాకపోకలకు అవకాశమే లేదు. వంక ప్రవాహం తగ్గినంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది.
గొర్రెల కాపరులకు తప్పిన ప్రమాదం
2022 నవంబరులో ఓబుల్‌రెడ్డిపల్లె సమీపాన ఉన్న వంక ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి. ఆ సమయంలో తండ్రీ కొడుకులు ఆవుల ఎర్రన్న యాదవ్, బాల మునీంద్రయాదవ్‌లు వంకకు పైన తమకు చెందిన గొర్రెలు ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు వంకను దాటాలని ప్రయత్నించారు. కాకపోతే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నీళ్లలో కొట్టుకుని పోతుండగా, ఒక కంపచెట్టును ఆశ్రయించి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విషయాన్ని గ్రామస్తులు గమనించి అప్పటి ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దృష్టికి ప్రమాద ఘటన గురించి తెలియజేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బోట్ల సాయంతో తండ్రీకొడుకులను ప్రాణాలతో రక్షించారు.
వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం
ఓబుల్‌రెడ్డిపల్లెకు గ్రామ పరిసరాల్లో ఉన్న మొగమూరు వంక వర్షాకాలంలో అన్ని రకాల ఇబ్బందులను కలగజేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కసారి ఈ వంక భారీ స్థాయిలో వర్షాలు కురిసినపుడు మూడు, నాలుగు రోజుల వరకు ప్రవాహం తగ్గే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వంకను దాటేందుకు వీలుగాక వంకనీళ్లలోనే మృతదేహాలను వదిలి అంత్యక్రియలను పూర్తి చేయాల్సిన దుస్థితి నెలకొనేది. గ్రామంలో కేవలం 5వ తరగతి వరకే చదువుకునే వీలుంది. 6వ తరగతి నుంచి పై తరగతులకు చదువుకునేందుకు వెళ్లేందుకు వేంపల్లె, వీరపునాయునిపల్లెకు వెళ్లాల్సి ఉంటుంది. వంక ప్రవాహం వల్ల చదువులకు తప్పని తిప్పలు కొనసాగేవి. చదువులు కుంటుపడేవి.
కోర్టు మెట్లెక్కిన కాంట్రాక్టర్
ఊరి మేలు కోసం వంతెన నిర్మాణం చేపట్టిన వీరయ్య యాదవ్ ఎన్నిమార్లు విన్నవించినా కూటమి ప్రభుత్వం బిల్లుల మంజూరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ చివరకు ఒక్కపైసా కూడా చెల్లించకుండా మాటలతోనే సరిపెట్టారు. ఈ నేపధ్యంలో వీరయ్య యాదవ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే ఎక్కడ వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో బిల్లులకు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కనపెట్టి గ్రామ సమస్యను తీర్చేందుకు చేపట్టిన వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
2023 నవంబరులో ఎట్టకేలకు ఆ గ్రామస్తుల ఇబ్బందులు తొలగేందుకు వంకకు అడ్డంగా వంతెన నిర్మా ణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి చొరవతో ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ పట్టుదలతో వంతెన నిర్మాణానికి సీఎండీఎ ఫ్, జీజీఎంపీ కింద రూ. 57 లక్షలు మంజూరైంది. ఇది లా ఉండగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేసరికి అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఒక్క పైసా కూడా వీరయ్య యాదవ్‌కు అందలేదు. కానీ ఊరి మేలు కోసం ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వంతెన నిర్మాణంతో ఆ గ్రామానికి 200 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
200 సంవత్సరాలుగా ఉన్న సమస్య
వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం
వంక నీళ్లలోనే మృతదేహాలను వదిలేసే దుస్థితి
చదువులకూ తప్పని తిప్పలు
వైఎస్ జగన్ హయాంలో వంతెన నిర్మాణం
తొలగిన అన్ని ఇబ్బందులు
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
బిల్లులు మంజూరు కాకపోవడంతో కోర్టు మెట్లెక్కిన వైనం