
డీఎస్సీలో మూడో ర్యాంక్ సాధించిన హేమలత
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరానికి చెందిన హేమలత 43 ఏళ్ల వయసులో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు విభాగంలో మూడో ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను 2004లో ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ పూర్తి చేశానన్నారు. వివాహం అయ్యాక తన భర్త పల్లేటి శ్రీనివాసులరెడ్డి ప్రోత్సాహంతో బీఈడీ పూర్తి చేసి ప్రైవేట్‌స్కూల్ టీచర్‌గా పనిచేశానన్నారు. 2012 డీఎస్సీలో సైన్స్ సబ్జెక్టు దరఖాస్తు చేసినప్పుడు డిగ్రీలో తన సబ్జెక్టులు బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కావడం, బోటని లేదా జువాలజీ ఉండాలన్న నియమంతో తన దరఖాస్తు రిజెక్ట్ అయిందన్నారు. తర్వాత ఎంఏ ఇంగ్లీషు పూర్తి చేసి 2018 డీఎస్సీలో 20వ ర్యాంకు సాధించాను. కానీ కేవలం రెండే పోస్టులు ఉండటంతో తనకు జాబ్ రాలేదన్నారు. అనంతరం ఇంటర్ కాలజీ ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తూ 2025 డీఎస్సీకి ప్రయత్నించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషులో 3వ ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించానన్నారు. ఎంఈడీ కూడా పూర్తి చేశానన్నారు. తన పెద్దకుమారుడు బీటెక్ ఫస్ట్ ఇయర్, రెండో కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడన్నారు. వ్యవసాయం చేస్తూ తనకు సహాయ సహకారాలు అందించిన తన భర్త ప్రోత్సాహాన్ని, తన తల్లి సహకారాన్ని మరువలేనన్నారు.