చాలీ చాలని జీతాలతో చాకిరి | - | Sakshi
Sakshi News home page

చాలీ చాలని జీతాలతో చాకిరి

Sep 15 2025 8:05 AM | Updated on Sep 15 2025 8:05 AM

చాలీ

చాలీ చాలని జీతాలతో చాకిరి

కడప ఎడ్యుకేషన్‌ : సమగ్రశిక్ష, విద్యా శాఖలో అత్యంత కీలకంగా పనిచేసే చిరుద్యోగులైన సీఆర్‌ఎంటీ(క్లస్టర్‌ రిజర్వు మొబైల్‌ టీచర్స్‌)లు, మండల లెవల్‌ అకౌంటెంట్లు, ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో చాకిరీ చేస్తూ కుటుంబాలను భారంగా మోస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరకులు, ఇంటి అద్దెలు, ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఏ ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ చాలీచాలని జీతాలతో జీవితాలను ఏ విధంగా సాగించాలని మదిలో మదనపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించకుండా, ఉద్యోగుల మధ్య వేతన అసమానతలను పెంచే విధంగా ఈ జీవో నంబర్‌–2ను అమలు చేస్తోంది. ఈ జీఓ కేవలం ఉద్యోగుల ఆర్థిక భద్రతను దెబ్బతీయడమేగాక, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విద్యాశాఖలో పనిచేసే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖలో..

జిల్లా వ్యాప్తంగా మండల వనరుల కేంద్రంలో 156 మంది సీఆర్‌ఎంటీలు, 19 మంది మండల లెవల్‌ అకౌంటెంట్స్‌, 34 మంది ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్లు, 35 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ.18,500 ఉండేది. ఆ తర్వాత వీరికి 2020లో గత వైసీపీలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 23,500కు వేతనం పెంచింది. ఆ తరువాత అధికారంలోకి కూటమి ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమమ్‌ టైం స్కేల్‌ వర్తింపచేయరాదని, 2025 జనవరి, 6వతేదీన జీవో నంబర్‌–2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖలలో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని తేల్చింది. ఈ జీవో రాజ్యాంగ కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని, కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే ఈ జీఓ ఉద్దేశమని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరమని. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించి, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని కోరుతున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి..

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినప్పటికీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌, నూతన రేషన్‌ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసినప్పటికీ చిరుద్యోగులకు వర్తింపచేయలేదని వారు తెలిపారు. నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దె విపరీతంగా పెరగడంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు సరిపోవడంలేదని వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పుచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్‌ సబ్సిడీ పథకాలను ప్రత్యేకంగా అమలుచేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలను విరివిగా పెంచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం వికలాంగులు, ఒంటరి మహిళ పెన్షన్‌, కుటుంబ సభ్యులకు వద్ధాప్యం పింఛన్‌ తొలగించారు. వాటిని తిరిగి పునరుద్ధరించి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు.

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు

వర్తించాలి

తెలుగుదేశం ప్రభుత్వం రిటైర్‌మెంట్‌ వయస్సు 58 నుండి 60 ఏళ్లకు పెంచింది. తదనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రెగ్యులర్‌ ఉద్యోగులకు 62 ఏళ్లకు పెంచింది. కానీ ఈ సౌకర్యం కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వర్తించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేస్తూ, రిటైర్‌మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచినా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మాత్రం వర్తింప యకపోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. అనేక సంవత్సరాలుగా తక్కువ జీతంతో పనిచేస్తూ, ఎలాంటి పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా, రిటైర్‌ అయ్యేసరికి కుటుంబానికి భారం అవుతున్న పరిస్థితి దురదృష్టకరమని ఆందోళన చెందుతున్నారు. వీరికి కూడా రెగ్యులర్‌ ఉద్యోగుల్లానే రిటైర్‌మెంట్‌ వయస్సు 62 సంవత్సరాలు, గ్రాట్యూటీ, పెన్షన్‌ పథకం లేదా ఉద్యోగ భద్రతకు దారిచూపే ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

ఏళ్లతరబడి పనిచేస్తున్నా

కనికరించని ప్రభుత్వం

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల

సంక్షేమం మరిచిన ప్రభుత్వం

ఆరేళ్లుగా వేతనం పెంపుకోసం

ఎదురుచూపు

చాలీ చాలని జీతాలతో చాకిరి1
1/1

చాలీ చాలని జీతాలతో చాకిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement