
లింగ నిర్ధారణ పరీక్షలపై విచారణ
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని ఓ నర్సు సిఫార్సుతో కర్నూల్‌లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఘటనపై జమ్మలమడుగు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీత విచారణ చేపట్టారు. బద్వేల్‌కు చెందిన ఒక గర్భిణీ లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అక్కడే పని చేస్తున్న లత అనే నర్సును ఆశ్రయించింది. ఆమె సూచన మేరకు సదరు గర్భిణీ ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న ఒక హాస్పిటల్‌లో పని చేస్తున్న రూతు అనే స్టాఫ్‌నర్సు వద్దకు వెళ్లింది. స్టాఫ్ నర్సు కర్నూల్‌లోని ప్రసాద్ అనే ఏజెంట్ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడికి వెళ్లమని గర్భిణీకి తెలిపింది. ఆమె కర్నూల్‌లో బస్సు దిగగానే అక్కడి ఏజెంట్ గర్భిణీని ఒక స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. అయితే ఆమెకు ఏడు నెలల గర్భం కావడంతో స్కానింగ్‌లో స్పష్టంగా కనిపించలేదని, నెల రోజులు గడచిన తర్వాత వస్తే మళ్లీ పరీక్షలు చేస్తామని చెప్పి పంపించాడు. అంతేగాక గర్భిణీ వద్ద రూ. 10 వేలు డబ్బు కూడా తీసుకున్నాడు. అయితే కర్నూలుకు వెళ్లి వచ్చిన కొన్ని రోజులకే ఆమెకు అబార్షన్ అయింది. లింగనిర్ధారణ పరీక్షలు చేయనప్పుడు తమ డబ్బు ఇప్పించాలని బద్వేల్‌కు చెందిన మహిళ ప్రొద్దుటూరులోని నర్సును నిలదీసింది. ఈ విషయం బయటికి పొక్కడంతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీతా బుధవారం హాస్పిటల్‌కు వెళ్లి నర్సును విచారించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటికే విచారణ చేశామని, కర్నూల్‌లో స్కానింగ్ జరగడంతో అక్కడి వ్యక్తులు, స్కానింగ్ సెంటర్ వివరాలను కర్నూలు డీఎంహెచ్‌ఓకు తెలిపామన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రొద్దుటూరులోని పలు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమేనని అయితే తగు ఆధారాలుంటే తప్పకుండా స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామన్నారు.