
నేడు గండిలో రెండో శ్రావణ శనివారోత్సవం
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో నేడు రెండో శ్రావణ మాస శనివారోత్సవం జరుగనుంది. గత వారం కంటే ఈవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని భావించిన ఆలయ వర్గాలు అందుకు సరిపడ ఏర్పాట్లు చేశారు. గత వారంలో తలెత్తిన చిన్నచిన్న లోపాలను సరిదిద్ది ఉత్సవాలకు తగు ఏర్పాట్లు చేశామని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజ తెలిపారు. భక్తుల అంచనాల మేరకు లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఉదయం 3గంటలకు సుప్రభాతసేవ, ఉత్సవమూర్తులకు అభిషేకం (ఏకాంతంగా), అలంకరణ, ఆరాధన, 5 గంటలకు మహామంగళ హారతి, అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు తెలిపారు. అలాగే రాత్రి బస చేయు భక్తుల కాలక్షేప నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు, అధికారులు సహకరించాలని చైర్మన్ కోరారు.
పరిస్థితిని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు
శ్రావణ మాస ఉత్సవాల రెండవ శనివారం భక్తుల రద్దీని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రంగారావులు తెలిపారు. పరిస్థితిని బట్టి లారీలు, టిప్పర్లు తదితర వాటిని వేంపల్లె వైపు నుంచి వచ్చే వాటిని ఇడుపులపాయ క్రాస్ వద్ద, రాయచోటి వైపు నుంచి వచ్చే వాటిని అద్దాలమర్రి క్రాస్ వద్ద ఆపేస్తామన్నారు. బస్సులు, కార్లు తదితరాలను భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఉత్సవాల సందర్భంగా పులివెందుల డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతోపాటు సుమారు 130 మంది వరకు సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
రక్తదాన శిబిరం ఏర్పాటు
రక్త దానం చేసి అపాయంలో ఉన్న ఇతరుల ప్రాణాలను కాపాడాలని ట్రిపుల్ ఐటీకి చెందిన ప్రసాద్ తెలిపారు. గండిలో రక్తదాన శిబిరం కడప రిమ్స్ వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.