
బాధ్యులెవరు? బాధితులు ఎవరు!
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో ఇటీవల సెల్‌ఫోన్‌లు లభించిన విషయం తీవ్ర దుమారం రేపింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై స్పందించిన జైళ్ల శాఖ రాష్ట్ర డీజీ అంజనీకుమార్ రాజమహేంద్రవరం డీఐజీగా పనిచేస్తున్న ఎం.ఆర్. రవికిరణ్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఈనెల 16వ తేదీన కడప కేంద్ర కారాగారంలో విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఈ క్రమంలో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లను ఒకరి తరువాత ఒకరిని సస్పెండ్ చేశారు. వీరిరువురిలో ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ తనకు సంబంధం లేకపోయినా తనపై చర్యలు తీసుకుంటారా? అని మనోవేదనకు గురై ఏకంగా తన రాజీనామా లేఖను అధికారులకు ఈనెల 23న సమర్పించారు. అలాగే కేంద్ర కారాగారంలో వివిధ సందర్భాల్లో దొరికిన 12 సెల్‌ఫోన్‌లు, ఒక ఛార్జర్ వ్యవహారంలో కొన్నింటి గురించి మాత్రమే కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు నమోదు చేశారు.
కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌పై చర్యలేవీ?
ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇద్దరు జైలర్లు, ముగ్గురు వార్డర్లను ఒకేసారి సస్పెండ్ చేయడం జైళ్లశాఖ చరిత్రలో ఇదే మొదటిసారి అని పలువురు భావిస్తున్నారు. కానీ పాత్రధారిగా, సూత్రధారిగా వ్యవహరిస్తున్న కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ కె. రాజేశ్వరరావుపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సాహసించడం లేదని ఆ శాఖ ఉద్యోగులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సమీప బంధువు ఒకరు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని, ఆయన ఒత్తిడి మేరకే సూపరింటెండెంట్‌పై చర్యలకు ఉపక్రమించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెట్రోల్ బంకులో అవినీతితో పాటు, పాలడైరీ, ఖైదీలకు చేరవేసే రేషన్, చికెన్, మటన్‌ల సరఫరా వ్యవహారంలోనూ అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు లేవంటున్నారు. మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జైళ్లశాఖ అధికారులను నెల్లూరులోని కారాగార ఉద్యోగుల శిక్షణా కేంద్రానికి పనిష్మెంట్ కింద పంపిస్తున్నారు. బాధ్యతగా పనిచేస్తున్న వారిపై సస్పెన్షన్ వేటు వేసి, బాధ్యుడైన కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావుపై నామమాత్రంగానైనా ఎలాంటి క్రమశిక్షణా చర్యలను తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2024 మార్చి నెలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డిప్యూటీ జైలర్ గాజుల మహమ్మద్ రఫీ, రిమాండ్ ఖైదీగా వున్న రామనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా రూ. 20వేలు ఫోన్‌పే ద్వారా తెప్పించుకున్నారు. ఎర్రచందనం కేసుల్లో రిమాండ్ ఖైదీగా వున్న జాకీర్ వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను కొనేందుకు రూ. 30వేలు ఫోన్‌పే ద్వారా జీవీ చంద్రమోహన్ అనే హెడ్ వార్డర్ డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలు ప్రాథమిక విచారణలో రుజువు కావడంతో కర్నూలు జిల్లా జైళ్లశాఖ అధికారిని విచారణాధికారిగా నియమించారు. విచారణలో సాక్షులను విచారణకు హాజరు కాకుండా చేసుకున్నారు. డిప్యూటీ జైలర్ రఫిని, హెడ్ వార్డర్ చంద్రమోహన్‌ను వారి బాస్‌గా వున్న ఓ ఉన్నతాధికారి కాపాడుతూ వచ్చారని సమాచారం. డిప్యూటీ జైలర్ గాజుల మహమ్మద్ రఫీ పెట్రోల్ బంకులో ఇన్‌చార్జిగా వ్యవహరించిన సమయంలో జరిగిన అవినీతిని కూడా బయటకు రానీయకుండా అదే ఉన్నతాధికారి ‘ఆపద్బాంధవుడు’లాగా ఆదుకున్నట్లు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారంలో అవినీతిని అరికట్టేందుకు, ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగించేందుకు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, కడప కేంద్ర కారాగార వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కాగా, కడప కేంద్ర కారాగారంలో తనిఖీలలో లభ్యమైన సెల్‌ఫోన్‌లు, చార్జర్ వ్యవహారంలో కడప రిమ్స్ పోలీసు స్టేషన్‌లో కేవలం మూడు కేసులే నమోదయ్యాయని తెలుస్తోంది. ఈ కేసుల్లో బాధ్యులైన వారిపై పోలీసుల చర్యలు ఏమిటన్నది తెలియడం లేదు. మిగతా కేసుల నమోదు విషయంలో, విచారణ వ్యవహారంలో పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కడప కేంద్ర కారాగారం అవినీతిమయం
కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌పై చర్యలేవీ?
డీఐజీ ప్రాథమిక విచారణలో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇద్దరు జైలర్లు, ముగ్గురు వార్డర్లు సస్పెండ్
గతంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన డిప్యూటీ జైలర్, హెడ్ వార్డర్‌ల మాటేమిటి?
రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల విచారణలో కనిపించని పురోగతి