
యాప్‌ండి సారూ!
● అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్‌లో ముప్పుతిప్పలు
● యాప్‌ల నిర్వహణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అంగన్వాడీ కార్యకర్తలు
● బాలింతలు, గర్భిణుల గుర్తింపులో సరిగా పనిచేయని ఫేస్ రికగ్నైజేషన్ యాప్
కడప కోటిరెడ్డిసర్కిల్: అంగన్వాడీ కార్యకర్తలు యాప్‌లతో సతమతమవుతున్నారు. లబ్ధిదారులకు పోషణ ట్రాకర్ బాలసంజీవిని అందించడానికి ఒకటా రెండా.. నాలుగు యాప్‌లను నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లబ్ధిదారుల ఫేస్ రికగ్నైజ్ చేసి యాప్‌లో నమోదు చేయాలి. ఇక్కడే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫేస్ రికగ్నైజ్ చాలామార్లు సక్సెస్ కావడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవిని ద్వారా లబ్ధిదారులకు ఫేస్ రికగ్నైజేషన్ చేసి బియ్యం ఇస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోషణ ట్రాకర్ ద్వారానే లబ్దిదారులను గుర్తించి సరుకులు ఇవ్వాలన్న నిబంధనను తప్పనిసరి చేయడంతో కార్యకర్తలు రెండు యాప్‌లను నిర్వహించాల్సి వస్తోంది. ఇది చాలా కష్టంగా ఉందని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ యాప్‌ల గురించి ముందుగా శిక్షణ ఇప్పించాలని విన్నవిస్తున్నారు. పైగా అంగన్వాడీ కేంద్రాల్లో నెట్‌వర్క్ రావడం లేదని.. మొబైల్స్ ర్యామ్ తక్కువగా ఉండడంతో యాప్ స్పందించక తిప్పలు తప్పడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు.
చిన్నారుల విద్యకు ఆటంకం
ఆయా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్బిణీలు, బాలింతలతోపాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు ప్రతినెల పోషకాహారాన్ని ఇంటి వద్దకే అందజేస్తున్నారు. గతంలో లబ్ధిదారులకు అంగన్వాడీ కేంద్రాల వద్దనే పోషకాహారాన్ని ఇచ్చేవారు. ఎక్కువ మంది తమకు ఇంటివద్దకే పోషకాహారం కావాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో టేక్ హోం రేషన్ (టీహెచ్‌ఆర్)గా మార్చి పాలు, కోడిగుడ్లు, నూనె, పప్పుదినుసులు, బియ్యం వంటివి ప్రతినెల రెండు దఫాలుగా అందిస్తున్నారు. నెలలో ఎక్కువ సమయం ఈ పనికే వినియోగించడం వల్ల చిన్నారుల ప్రాథమిక విద్యకు ఇబ్బందిగా మారిందని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీంతోపాటు జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో 15 రకాల రికార్డులను నిర్వహించాల్సి వస్తోంది. దీనివల్ల చిన్నారుల ప్రాథమిక విద్యకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు.
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు: 2389
గర్బిణీలు: 10,534
బాలింతలు: 8079
3 ఏళ్లలోపు పిల్లలు: 65,335
ఆరేళ్లలోపు పిల్లలు: 53,162
యాప్ పనిచేయక రేషన్ కోల్పోతున్నాం
నా ఫేస్ రికౖగ్నైషన్‌కు పోషణ్ యాప్ ద్వారా ఎన్నిమార్లు ఐరిస్ తీసినా వీలు కాలేదు. ఒకసారి సక్సెస్ వచ్చినా, రెండవసారి మ్యాచ్ కావడం లేదు. దీనివల్ల నేను రేషన్ కోల్పోతున్నాను. ప్రభుత్వం స్పందించి యాప్ కష్టాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలి. – స్రవంతి, లబ్దిదారు, కడప

యాప్‌ండి సారూ!

యాప్‌ండి సారూ!