
ప్రతి మండలంలో మోడల్ కిచెన్‌లు
చింతకొమ్మదిన్నె: రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ఏర్పాటు చేస్తున్న ఆటోమేషన్ కిచెన్ (మోడల్ కిచెన్) లను జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం చింతకొమ్మ దిన్నె మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, జె.కొత్తపల్లె ఉన్నత పాఠశాలలలో జరుగుతున్న సెంట్రలైజ్డ్ ఆటోమేషన్ కిచెన్ హాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పాఠశాల లో సెంట్రలైజ్డ్ ఆటోమేషన్ ఆఫ్ కిచెన్స్ (మోడల్ కిచెన్) భవన నిర్మాణ పనులను పరిశీలించి సంబందిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వంట నిర్వాహకులతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్రానికే ఆదర్శంగా జిల్లాలో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ హాళ్లను జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కడప ఆర్టీఓ జాన్ ఇర్విన్, ఆగ్రోస్ డీఎం, సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ రాజరత్నం, సీకే దిన్నె తహసిల్దార్ నాగేశ్వరరావు, డీఈవో శంశుద్దిన్, ఏపీఎస్పీడిసిఎల్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, ఎస్‌ఎస్‌ఏ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, ఎంఇఓ, ఆయా పాఠశాలల హెచ్‌ఎం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
పీ–4 అమలుపై ప్రత్యేక శ్రద్ధ
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4పథకం అమలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రకియ చేపట్టాలని సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంత రం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సేవలు అందించడంలో ప్రజల నుంచి సానుకూలత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ సేవలు సంతృప్త స్థాయిలో ప్రజలకు అందేలా అన్ని శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అదితిసింగ్, డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.