
పారదర్శకంగా పథకాల అమలు
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను జిల్లాలో పారదర్శకంగా అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో పీ4, సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ తదితర కార్యక్రమాల అమలు నిర్వహణపై కలెక్టర్ జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ది చేయడం కోసం రాంప్ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంలో భాగంగా జిల్లాలో ఇప్పటికే బంగారు కుటుంబాలను ప్రాథమికంగా సర్వే, గ్రామసభలు ద్వారా గుర్తించామని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా ఎంటర్ ప్రెన్యూర్లను సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ కూడా ప్రభుత్వ రంగానికి ఆర్థిక మద్దతునిస్తోందన్నారు. అందులో భాగంగా జిల్లాలో ఉద్యం వర్క్‌షాప్‌లను నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. పీ4 ఫౌండేషన్ అమలులో భాగంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో ఇప్పటికే జిల్లాలో 78 వేల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని, దాదాపు 10 వేల మందిని ఎంపిక చేసిన మార్గదర్శుల ద్వారా అడాప్ట్ చేసుకోవడం జరిగిందన్నారు. ఆగస్టు 10 నాటికి తుది జాబితాలో ఉన్న బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని వివరించారు. సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ మెయిన్ స్కూలులో పైలెట్ ప్రాజెక్టుగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి మండలంలోను ఇలాంటి ఒకే సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, చంద్రమోహన్, సీపీవో హజరతయ్య, డిఆర్డీఏ, డ్వామా పీడీ ఆది శేషారెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం చాంద్ బాషా, డీపీఓ ఏవో ఖాదర్ బాషా, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి