
యువతి ఆత్మహత్య
మైలవరం : మండల పరిధిలోని వేపరాల గ్రామానికి చెందిన కుండా లక్ష్మీదేవి(39) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ శ్యాం సుందర్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుండా లక్ష్మీదేవికి భర్త తరపున ఆడపడచులతో మనస్పర్థలు వస్తుండటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని తమ దృష్టికి తీసుకుని వస్తే కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. జీవితాలకు ఇలా అర్థంతరంగా ముగింపు పలికితే పిల్లల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు.
అస్సాంలో మెడికో ఆత్మహత్య
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన పడిగేపాటి లక్ష్మిరెడ్డి కుమార్తె పడిగేపాటి హేమలత(25) వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. హేమలత ఇంటర్మీడియట్ నుంచి చదువులో బాగా రాణిస్తుండటంతో మెడిసిన్‌లో ఉచితంగా సీటు దక్కించుకుంది. పీజీలో సైతం ఉచిత సీటు రావడంతో అస్సాంలోని బార్పేట జిల్లా ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ మెడికల్ కాలేజిలో గైనకాలజీ రెండో సంవత్సరం చదువుతోంది. గైనకాలజీ కోర్సులో భాగంగా హాస్పిటల్స్‌లో వర్కింగ్ విధులు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల మానసిక వత్తిడి తట్టుకోలేక ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో వైద్యుల వద్దకు వెళ్లి చూపించుని ఆరోగ్యం కుదుట పడటంతో తిరిగి రెండు నెలల క్రితం అస్సాం వెళ్లింది. తిరిగి మానసిక వత్తిడికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోట్లదుర్తిలో ఉన్న తల్లిదండ్రులకు కాలేజి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు అస్సాంకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇనగలూరు దాడి కేసులో ఐదుగురి అరెస్టు
తొండూరు : మండలంలోని ఇనగలూరు గ్రామానికి సంబంధించి సైదాపురం బస్టాప్ సమీపంలో జరిగిన దాడి ఘటన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఘన మద్దిలేటి తెలిపారు. బుధవారం ఇనగలూరు క్రాస్ రోడ్డు వద్ద ప్రశాంత్‌రెడ్డి, ఓబుళరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, గంగిరెడ్డిలను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించిన కేసులో మిగిలిన ఆరుగురిని కూడా త్వరలో పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.
పోలీసులు కొట్టారని నిందితుల ఆరోపణ
ఇనగలూరు గ్రామంలో జరిగిన దాడి సంఘటనకు సంబంధించిన నిందితులు తమను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని కొట్టి వేధింపులకు గురి చేశారని జడ్జి ఎదుట వాపోయినట్లు తెలిసింది. దీంతో జడ్జి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. ఇరువర్గాల వారు అధికార పార్టీకి చెందినవారే అయినప్పటికీ ఒక వర్గానికి పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మద్దతు తెలపడంతోనే పోలీసులు తమను చితకబాదారని బాధితులు పేర్కొంటున్నారు.
కారును ఢీ కొన్న లారీ
ఒంటిమిట్ట : మండల పరిధిలోని మంగంపేట వద్ద కడప–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం కారును లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజంపేటలోని నూనెవారిపల్లికి చెందిన నలుగురు కారులో కడపకు వెళ్తుండగా మంటపంపల్లి వద్ద ఉన్న డాబాల సమీపానికి రాగానే కడప నుండి చైన్నె వెళ్తున్న గ్యాస్ లారీ ఎదురుగా వచ్చి ఢీ కొంది. దీంతో కారులోని తరుణం (17), కిరణ్ (20), రాఘవేంద్ర (20), బాలు (23) అనే నలుగురు యువకులకు రక్త గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108 సహాయంతో కడప రిమ్స్‌కు తరలించారు.

యువతి ఆత్మహత్య

యువతి ఆత్మహత్య