
ఆరా పేరుతో టోకరా !
మదనపల్లె రూరల్ : ఆరా యాప్.. కేవలం రూ.2వేలు చెల్లించండి. ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్‌నకు మేము పంపే 5 వీడియోలు చూస్తే చాలు.. మీ ఖాతాలో వేలకు వేలు డబ్బులు జమ అవుతాయంటూ పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని, భారీ స్థాయిలో ఆన్‌లైన్ మోసానికి పాల్పడిన వైనం బుధవారం మదనపల్లెలో వెలుగు చూసింది. బ్యాంకు ఖాతాలకు నగదు జమ కాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని మీడియాతో తమ గోడును వినిపించారు. ఆరా బురిడీ కొట్టించిన వైనంపై సైబర్ క్రైమ్ సెల్‌కు స్థానికుడైన వి. రాజ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం ఎగువ కురవంకకు చెందిన మోహన్‌బాబు.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆరా యాప్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆరా యాప్‌లో.. రూ.2వేలు డిపాజిట్ చెల్లించి సభ్యులుగా చేరితే.. సభ్యులను గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపునకు ఒక్కో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. అందులో ప్రతిరోజు 5 వీడియోలను వాట్సప్ లింక్ ద్వారా పంపుతారు. వాటిని వీక్షిస్తే..ఒక్కో వీడియోకు రూ.65 చొప్పున నగదు నేరుగా సభ్యుడి బ్యాంకు వ్యక్తిగత ఖాతాకు ఆన్‌లైన్‌లో జమచేస్తామని చెబుతారు. ఇలా మొదట్లో చేరిన సభ్యులకు...ఠంచనుగా డబ్బులు ఖాతాలకు జమచేస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఈ యాప్‌లోని స్పిన్ వీల్‌లో మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటే, అందులో గెలిచిన బహుమతులను సైతం ఇస్తామని ప్రకటించారు. మొదట్లో గెలిచిన కొద్దిమందికి ఇచ్చారు. బహుమతులు, డబ్బులు జమ అయిన సభ్యులతో తాము ఎలా లాభం పొందిందనే విషయం వారి మాటల్లోనే చెప్పిస్తూ వీడియోలు తీసి విస్తృతంగా ప్రచారం చేశాడు. దీంతో వేలసంఖ్యలో ప్రజలు ఆరా యాప్‌లో సభ్యులుగా చేరారు. సులభంగా డబ్బులు వస్తాయనే దురాశతో మదనపల్లె పరిసర ప్రాంతాల్లో సుమారు 6వేల మందికి పైగా డిపాజిట్లు చెల్లించి సభ్యులుగా చేరారు. ఆరా యాప్ నిర్వాహకులు చెప్పినట్లుగానే వీడియోలు చూశారు. డబ్బులు ఖాతాకు జమచేసినట్లు యాప్‌లో మెసేజ్ వచ్చింది. అయితే డబ్బులను ఖాతా నుంచి తీసుకునేందుకు వెళితే మాత్రం డబ్బులు జమ కాలేదని తెలవడంతో మోసపోయామని గుర్తించారు. కొద్ది రోజులుగా ఆరా యాప్ పేరుతో క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్ ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లింది. దీంతో బాధితులు తాలూకా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆరా యాప్ సొమ్ముల కోసం నిర్వాహకులకు తెలియజేసిన ఆధార్, వ్యక్తిగత బ్యాంకు ఖాతాల సమాచారంతో భవిష్యత్తులో తమకు ఏదేని ఇబ్బందులు తలెత్తవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. జరిగిన మోసంపై పోలీసుల సలహా మేరకు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిర్వాహకుడైన మోహన్‌బాబును ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నిస్తే.. అందుబాటులోకి రాలేదు.
వీడియోలు చూడండి..
డబ్బులు సంపాదించండి
నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా లక్షలు వసూళ్లు
మదనపల్లె పరిసర ప్రాంతాల్లో
6 వేలకు పైగా బాధితులు
న్యాయం చేయాలంటూ
తాలూకా పోలీస్ స్టేషన్‌కు పరుగులు
సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు