
మహిళ అదృశ్యం
కలసపాడు : మండలంలోని ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన షేక్ మస్తాన్‌బీ(30) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ తిమోతి బుధవారం తెలిపారు. సోమవారం సాయంత్రం మస్తాన్‌బీ దుకాణానికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆమె భర్త హసన్‌వలీ ఫిర్యాదు చేశాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9121100632 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
కడప అర్బన్ : కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓం శాంతి నగర్‌లో ఈనెల 17వ తేదీన ఉమామహేశ్వరి (52) తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన కుమారుడు సాయి ప్రతాప్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసేవాడు. అప్పులు చేసి ఇబ్బంది పడిన అతని వ్యవహార శైలి మార్చుకోక పోవడంతో తల్లి తీవ్ర ఆవేదనకు గురైంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వెంటనే బంధువులు కర్నూలుకు తరలించారు. బుధవారం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌకు పోలీసులు తెలిపారు.
దొంగతనం కేసు నమోదు
చాపాడు : మండలంలోని టీఓపల్లెకు చెందిన ఎల్.రవిశంకర్‌రెడ్డి అనే వ్యక్తిపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. టీఓపల్లెకు చెందిన రవిశంకర్‌రెడ్డి తమ గ్రామంలోని పొలాల్లో నాలుగు విద్యుత్ స్తంభాలను తమ అనుమతి లేకుండా తొలగించుకుని తన అవసరాలకు వాడుకున్నాడని, వీటి విలువ రూ.4వేలు ఉంటుందని విద్యుత్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
వరకట్న వేధింపులపై..
పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లెకు చెందిన షేక్ రేష్మా అనే మహిళ భర్త, అత్తామామలు వరకట్నం తేవాలని వేధిస్తున్నారని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త నవాజ్ షరీఫ్, మామ ఖాజా మొహిద్దీన్, అత్త రహమత్‌బీలు పెళ్లయినప్పటి నుంచి రేష్మాను అదనంగా వరకట్నం తేవాలని వేధిస్తుండటంతో భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు సీఐ చాంద్ బాషా తెలిపారు.
లైంగికంగా వేఽధిస్తున్నాడని..
చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని దినకర్ అనే వ్యక్తిపై బుధవారం లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. స్థానిక దళితవాడకు చెందిన దినకర్ తన ఇంటి సమీపంలోని ఓ ఇంటిలోకి వెళ్లి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
డబ్బులు ఎగ్గొట్టాడని..
పులివెందుల రూరల్ : కర్నూలు జిల్లా బేతేంచర్ల గ్రామానికి చెందిన కరీం బాషాపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చాంద్ బాషా తెలిపారు. ఏడాది క్రితం పులివెందుల చీనీ కాయల మార్కెట్‌లో వేలం పాట పాడి సుమారు రూ.30 లక్షలు ఇవ్వకుండా వెళ్లిపోవడంతో చీనీ వ్యాపారులు సూరారెడ్డి, సాదిక్ బాషా, హనుమంతురెడ్డిలతోపాటు మరో ఐదుగురు వ్యాపారులు బుధవారం కరీం బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.