
‘ఆడబిడ్డ నిధి’ ఇవ్వకుండానే రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు
కడప కార్పొరేషన్ : ‘ఆడబిడ్డ నిధి’ ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాయాల్సిందేనని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారని...వాస్తవానికి ఆ పథకం అమలు చేయకుండానే కూటమి నేతలు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా విమర్శించారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నీరుగార్చేందుకు మంత్రులతో ఇలా మాట్లాడిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో 143 హామీలు ఇచ్చారని, లోకేష్ యువగళంలోనూ అవే హామీలు ఇచ్చారన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సంతాలు పెట్టిన బాండ్లను ప్రతి గడపకు పంపిణీ చేశారన్నారు. అప్పుడు హామీ ఇచ్చిన అదే నోటితో అమలు చేయలేమంటున్నారన్నారు. రాష్ట్రంలో 18ఏళ్లు నిండిన మహిళలు 1.80కోట్ల మంది ఉన్నారని, వారికి మొదటి ఏడాది రూ.32,500 కోట్లు ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది 35,100 కోట్లు బకాయి పడ్డారన్నారు. అన్నీ లెక్కలు వేసుకున్నాం... కచ్చితంగా హామీలు అమలు చేసి తీరుతాం...లేనిపక్షంలో కాలర్ పట్టుకొని నిలదీయాలని చెప్పిన చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో రూ.3.33 లక్షల కోట్లు అప్పు చేస్తే, చంద్రబాబు 14 నెలల్లోనే రూ.1.87లక్షల కోట్లు చేశారన్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు.
అక్రమ వసూళ్లే వారి పరమావధి
కూటమి నేతలకు కింది నుంచి పైదాకా అక్రమ వసూళ్లు చేయడమే పరమావధిగా మారిందని అంజద్‌బాషా విమర్శించారు. మహానాడు పేరు చెప్పి ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. తానేం తక్కువ కాదంటూ ఆ పార్టీలోని విద్యార్థి నాయకుడు అన్ని విద్యాసంస్థల నుంచి అక్రమ వసూళ్లు చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, నార్త్ జోన్ అధ్యక్షుడు బీహెచ్ ఇలియాస్, మైనార్టీ నేతలు షఫీ, జమీల్ పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా